టీ20 వరల్డ్ కప్ వాయిదా లాంఛనమే

by  |
టీ20 వరల్డ్ కప్ వాయిదా లాంఛనమే
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ వాయిదా నిర్ణయంపై ఇన్నాళ్లూ ఊగిసలాడుతూ వచ్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదాకే మొగ్గు చూపింది. అక్టోబర్‌లో జరుగాల్సిన ఈ మెగా టోర్నీని నిర్వహించలేమని ఇప్పటికే ఆతిథ్య క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చెప్పింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పరిస్థితులు కూడా టీ20 వరల్డ్ కప్‌ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఐసీసీ అధికారి ఒకరు చెప్పారు. ఈ నిర్ణయాన్ని గురువారం లేదా శుక్రవారం మీడియాకు తెలియజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు ఐసీసీ చాలా కృషి చేసింది. కానీ, ప్రస్తుతం ఐసీసీ వద్ద ఎలాంటి అనుకూలమైన అవకాశాలు లేవు. దీంతో ఈ టోర్నీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది’ అని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. గతంలో కూడా చాలా సార్లు వాయిదా నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. జూన్ 10న జరిగిన ఐసీసీ సమావేశంలో నెల రోజుల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. ఈ నెల 10కి నెల రోజుల గడువు పూర్తి కావడంతో ఇకపై నిర్ణయాన్ని వాయిదా వేయకూడదని భావిస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ వాయిదా నిర్ణయంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమం కానున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు.


Next Story

Most Viewed