మావోయిస్టు శారదక్క లొంగుబాటు

by Shyam |
Maoist Saradakka
X

దిశ, తెలంగాణ బ్యూరో : దీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో అజ్ఞాత జీవితం గడుపుతున్న శారదక్క తెలంగాణ డీజీపీ సమక్షంలో ఆదివారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ మెంబర్ హోదాలో పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్న శారదక్క చివరకు ఉద్యమానికి స్వస్తి చెప్పి లొంగిపోయారు. ఆమె భర్త యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మావోయిస్టు పార్టీకి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ ఇటీవల కరోనా బారిన పడి చనిపోయారు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆమె లొంగిపోయారు.

భర్తతో పాటే ఆమె కూడా కరోనా బారిన పడి చనిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆమె బతికే ఉన్నారని, చనిపోలేదని, కరోనా కూడా సోకలేదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక సందర్భంలో పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె డీజీపీ ఎదుట లొంగిపోవడం గమనార్హం.

దీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన శారదక్క స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామం. లొంగుబాటుకు కారణాలను పార్టీ అధికారపూర్వకంగా ప్రకటించలేదు. కానీ భర్త చనిపోయిన తర్వాత అజ్ఞాత జీవితం గడపడానికి సుముఖంగా లేని శారదక్క మానసికంగా ఆందోళనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నందున అడవి బాట విడిచి పెట్టి లొంగిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story