ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే తుది నిర్ణయం

by Shamantha N |   ( Updated:2021-01-18 04:09:26.0  )
ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే తుది నిర్ణయం
X

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున ఢిల్లీలో రైతులు చేపట్టే ట్రాక్టర్ ర్యాలీపై తాము జోక్యం చేసుకోబోమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అది శాంతి భద్రతలకు సంబంధించిన అంశమని, దానిపై ఢిల్లీ పోలీసులు లేదా కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఈ నె 26న ఢిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీ విరమణకు ఆదేశించాలని అభ్యర్థి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల ద్వారా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం సోమవారం విచారిస్తూ ‘ట్రాక్టర్ ర్యాలీపై న్యాయస్థానం జోక్యం చేసుకుంటే తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదముంది. ఢిల్లీలోకి ఎవరిని అనుమతించాలనే అంశాన్ని తాము పర్యవేక్షించం. మీ అధికార పరిధిని పరిశీలించి రైతులను ఢిల్లీలోకి అనుమతించాలా? లేదా? అని ఆలోచించండి. అది మా పని కాదు’ అని కేంద్రానికి తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరించారు. ‘మీకున్న అధికారాలను మాతో చెప్పించాలని ఎందుకు అనుకుంటున్నారు? పోలీసుల చట్టం కింద ఏం అధికారాలున్నాయో కేంద్రానికి సుప్రీంకోర్టు చెప్పాలా?’ అంటూ ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వీ రామసుబ్రమణియన్‌‌లు ఈ రోజు అందుబాటులో లేనందున ఈ కేసును 20న విచారిస్తామని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed