NCRB Report : 24శాతం పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు

by Shamantha N |
NCRB Report : 24శాతం పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు
X

న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. నాలుగేళ్లలో నిరుద్యోగుల బలవన్మరణాలు ఏకంగా 24శాతం పెరిగాయి. ఈ విషయాన్ని పార్లమెంట్‌కు ఇటీవల సమర్పించిన నివేదికలో ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో’(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం, 2016 నుంచి 2019 వరకు మొత్తం 10,294 మంది ఉద్యోగం రాలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

2016లో 2,298 మంది, 2017లో 2,404 మంది, 2018లో 2,741 మంది, 2019లో 2,851 మంది నిరుద్యోగులు బలవన్మరణం పొందారు. అంటే, 2016లో 2,298 మంది సూసైడ్ చేసుకోగా ఈ సంఖ్య 2019కి వచ్చేసరికి 24శాతం పెరిగి 2,851కి చేరింది. 2019లో కర్ణాటక(553), మహారాష్ట్ర(452), తమిళనాడు(251) రాష్ట్రాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కరోనా తర్వాత మరింత పెరిగి ఉండొచ్చు..

ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య కరోనా వచ్చిన తర్వాత మరింత పెరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి ప్రవేశించిన తర్వాత భారత్‌లో కోటి మందికి పైగా తమ ఉద్యోగాలు కోల్పోయారని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ వ్యాస్ తెలిపారు. 97శాతం కుటుంబాల ఆదాయం తగ్గిందని వెల్లడించారు.

Advertisement

Next Story