కంట్రోల్ తప్పిన జీవితం.. ఆత్మహత్యలే సొల్యూషనా..!

by Anukaran |   ( Updated:2020-09-05 20:25:49.0  )
కంట్రోల్ తప్పిన జీవితం.. ఆత్మహత్యలే సొల్యూషనా..!
X

జీవితంలో వెనక్కి తీసుకోలేని అంశాలు రెండే. ఒకటి కాలం. మరొకటి ప్రాణం. తొందరపాటు జీవితాన్ని చిదిమేస్తుంది. ప్రేమను పెంచుకున్న కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగుల్చుతుంది. గెలవడం ధ్యేయం కావాలనుకోవడం మంచిదే. గెలుపే జీవితం కాదు. ఓడినంత మాత్రాన జీవితం వృథా కాదు. ఆత్మవిశ్వాసానికి మించిన విజయం లేదు. ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సహనం లోపించడమే అతిపెద్ద సమస్యగా మారింది. క్షణికావేశంలో తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు జీవితాలను బుగ్గి పాలు చేస్తున్నాయి.

దిశ, న్యూస్ బ్యూరో:

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఆత్మహత్యలు పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన 2019 ఆత్మహత్యల నివేదికలో మన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, తమిళనాడు ముందు వరుసలో ఉన్నాయి. ఆర్థిక పరమైన కష్టాలతో బలవన్మరణం చెందుతున్న వారిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 2018తో పోలిస్తే ఇలాంటివారి సంఖ్య 3.5 శాతం మేరకు పెరిగింది. మహారాష్ట్రలో 1,526, కర్ణాటకలో 1,432, తెలంగాణలో 989 ఆత్మహత్యలు జరిగా యి. కుటుంబ సమస్యలతో 32.4 శాతం, వివాహ సమస్యలతో 5.4, అనారోగ్య కారణాలతో 17.5 శాతం మంది ప్రాణాలు తీసుకున్నారు.

దేశంలోనూ అధికం..

ఆత్మహత్యల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారిందని నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రతీ 40 సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతుం డగా, మన దేశంలో ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు బలవంతంగా చనిపోతున్నారు. ఇందులో యువత ఎక్కువ కావడం, మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం. 2019 నివేదికల ప్రకారం దేశంలో రోజూ సగటున 381 మంది ప్రాణాలు తీసుకున్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలమైనది. అనుబంధాలు, ఆప్యాయతలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. చిన్నచిన్న కుటుంబ సమస్యలను కొందరు భూతద్దంలో చూసి, చులకన అయిపోతామన్న భావనతో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారని నివేదికలో వివరించారు. పాశ్చా త్య సంస్కృతి ప్రభావం విద్యార్థులను దారి తప్పిస్తోంది. ప్రేమ, పెళ్లి వంటి అంశాలే కాక, మత్తుమందులకు బానిసలు కావడం వంటివి యువత జీవితాలను చిదిమేస్తున్నాయి.

యువత, పురుషులే ఎక్కువ..

రాష్ట్రంలో గతేడాది 7,675 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా 67 శాతం మంది తనువును చాలించారు. ఇందులో రోజువారీ కూలీలు 2,858 మంది ఉన్నారు. లక్ష రూపాయలలోపు వార్షికాదాయం ఉన్నవారు 4,353 మంది, నిరక్ష్యరాస్యులు 2,829 మంది బలవంతంగా ఊపిరి తీసుకున్నారు. యువత. చిన్న చిన్న కారణాలతో ఉరికి వేలాడుతున్నారు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం 18 నుంచి 30 ఏండ్లలోపు వారు 3,076 మంది ఉంటే, 30 నుంచి 45 ఏండ్లలోపువారు 4,055 చావు వెంట పడుతున్నారు. వీరిలో విద్యార్థులు 349 మంది ఉంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి వంద మందిలో 70 మంది పురుషులు ఉంటున్నారు. ఉరి వేసుకుని 53.6 శాతం, విషం తీసుకుని 25.8, నిప్పంటించుకుని 3.8 శాతం మంది ఊపిరి వదులుతున్నారు.

ఇందుకే ప్రాణం తీసుకుంటున్నారు..

ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు అనిపించినవారు, సమాజంలో పరువుపోతుందన్న భయంతో బాధపడుతున్నవారు, చదువులో వెనుకబడినవారు, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేక పోతున్నామనుకునేవారు, మత్తుమందులు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారు, బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నవారు, పెద్దవారిలో అయితే కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగా, వివాహేతర సంబంధాలున్నవారు, దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేక అనుమానించుకునేవారు చావును వెతుక్కుంటున్నారని గుర్తించారు. ప్రేమ అనుబంధాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు, అవాంఛిత గర్భం, మహిళలకు వరకట్న వేధింపులు, నయంకాని జబ్బులు, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు, రాజకీయ అస్థిరత, మతపరమైన విద్వేషాలు, సైద్ధాంతిక కారణాలు, హీరోలపై మితిమీరిన అభిమానం, ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం, నిరుద్యోగం వల్ల, అనువంశిక, జన్యులోపాలు, కుటుంబంలో ఎవరి అండదండలు లేకపోవడం, ఒంటరితనం, మోసపోవడం, మతి స్థిమితం లేకపోవడం తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

విద్యార్థుల్లోనూ..

విద్యార్థుల చావుల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు పలు కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడైంది. పేద పిల్లలు చదువులో ఫెయిలయినా లేదా మార్కులు తగ్గినా ఆత్మహత్య చేసుకోవటం లేదు. ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవటం లేదు. ఆత్మహత్య చేసుకొనేవారిలో అధిక శాతం కార్పొరేట్ కాలేజీలలో, విద్యాసంస్థలలో చదివే పిల్లలే కావడం, ఐఐటీ లేదా నీట్‌ కోసం చదివేవారే కావడం గమనార్హం. ఆర్ట్స్ చదివే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం లేదు. ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అనేది నిర్ణయించడంలో తల్లిదండ్రులే కీలకంగా వ్యవహరిస్తూ విద్యార్థుల అసక్తులకు, వారి శక్తిసామర్థ్యాలకు, వారి సొంత నిర్ణయాలు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని గుర్తించారు. ఇష్టం లేని చదువులు చదవలేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని నివేదికల్లో పేర్కొన్నారు. తెలంగాణలో 349 మంది, మహారాష్ట్ర 305, తమిళనాడు 295 మంది విద్యర్థులు ఇలా చనిపోయారు.

రైతు ఆత్మహత్యలు..

రైతు ఆత్మహత్యలలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. 2019లో ఎన్‌సీఆర్‌బీ నివేదికల ప్రకారం 499 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 10,281 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 3927 మందితో మహారాష్ట్ర మొదటి, 1992 మందితో కర్ణాటక, 1,029 మంది రైతుల ఆత్మహత్యలతో ఏపీ, 541 మందితో మధ్యప్రదేశ్ ఉండగా 499 రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 20.6 శాతంగా రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి.

ఇదీ పరిస్థితి..

– ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో పురుషుల శాతం 70.2
– మహిళల శాతం 29.8
– వివాహం తర్వాత ప్రాణాలు తీసుకుంటున్న పురుషులు 68.4
– కుటుంబ సమస్యలతో చావును కోరుకుంటున్నవారు 32.4
– అనారోగ్య కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారు 17.5
– ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న వారు 53.6
– ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ స్థానం : 03
– రాష్ట్రంలో మొత్తం ఆత్మహత్యలు 7,675
– పురుషులు 5,612
– మహిళలు 2062
– ట్రాన్స్ జెండర్ 01

Advertisement

Next Story

Most Viewed