నేచర్.. ‘క్యూర్’

by Shyam |   ( Updated:2020-10-21 20:42:12.0  )
నేచర్.. ‘క్యూర్’
X

ప్రకృతి నిజాలను చెబుతోంది. అబద్దాలను, నిర్లక్ష్యాన్ని, అక్రమాలను కుండబద్ధలు కొడుతోంది. మోసాలకు పాల్పడినవారి నిగ్గు తేలుస్తోంది. చెరువులను, కుంటలను కబ్జా చేసిన పెద్దల ఆగడాలను బయట పెడుతోంది. నాలాలను ఆక్రమించుకొని బహుళ అంతస్థుల భవనాలను నిర్మించినోళ్లను కూడా వదలడం లేదు. వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. నిజానికి ఈ పనులను నీటి పారుదల శాఖ, హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు చేయాలి. కానీ, ప్రకృతి పూర్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జోరు వానలతో హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులన్నీ నిండిపోయాయి. చాలావరకూ అలుగు పోస్తున్నాయి. ఇప్పుడు కొలతలు వేయాల్సిన పని లేదు. వందల ఏండ్లనాడు నిర్మించిన చెరువులకు ఎఫ్టీఎల్ హద్దులను భారీ వరదలే గుర్తించాయి. అధికార యంత్రాంగం అక్కడి వరకు రాళ్లు పాతేస్తే సరిపోతుంది. ఇన్నాండ్లుగా నీటి పారుదల, హెచ్ఎండీఏ శాఖలు, రియల్టర్లు, రాజకీయ నాయకులు ఆడిన నాటకాలన్నీ ఇవి బయట బయట పెట్టేశాయి. ఎఫ్టీఎల్ పరిధిలో లేవంటూ జారీ చేసిన ఎన్వోసీల వెనుకున్న ఆంతర్యమేమిటో జనానికి తెలిసింది. ఎన్వోసీ ప్రాంతాలు చెరువు నీటిలో మునిగిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని అనుమతులు ఉన్నాయని ప్లాట్లు, ఫాం ల్యాండ్స్ కొనుగోలు చేసినవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రూ. లక్షలు పోసి ప్లాట్లు కొనుగోలు చేసి మునిగిపోయామని వారు రోదిస్తున్నారు. నగర శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వేసిన వందలాది లేఅవుట్లు నీటితో కళకళలాడుతున్నాయి. చెరువు, కుంటలను ఆనుకొని ఉన్న వెంచర్లన్నీ మునిగాయి. రూ.కోట్లు పోసి కొనుగోలు చేసిన గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లు సైతం మోకాళ్ల లోతు నీళ్లలో దర్శనమిస్తున్నాయి.

మట్టిని నింపేసి

బడాబాబులు, పెద్ద పెద్ద సంస్థల యజమానులు చెరువులనే మాయం చేసే ప్రయత్నాలు చేశారు. రావిర్యాల చెరువు శిఖంలో 18 అడుగుల ఎత్తు వరకు మట్టిని నింపేశారు. ఆ చెరువులోనే పెద్ద పెద్ద గోతులు పెట్టి మట్టిని తోడేశారు. 100 ఎకరాల్లో మట్టిని నింపేసి ఎఫ్‌టీఎల్‌ ను వివాదాస్పదం చేశారు. దుబ్బచర్ల, కల్వకోలు రెవెన్యూ పరిధిలోని చెరువులు, కుంటల్లోనూ అదే తరహా ప్రణాళికలను అమలు చేశారు. రెవెన్యూ రికార్డులో కళ్లెం చెరువు 76.13 ఎకరాలు ఉండగా హెచ్‌ఎండీఏ పర్యవేక్షణలో ఆర్వీ అసోసియేట్స్‌(ఆర్కిటెక్ట్స్‌ ఇంజినీర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌) సంస్థ చేపట్టిన సర్వేలో 48.31 ఎకరాలేనని గుర్తించారు. ఎర్రగుంటలోనూ ఆరు ఎకరాలకు పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ రెండు చెరువుల్లోనే 35 ఎకరాల ఖరీదైన చెరువు శిఖం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినట్లు తేలింది. కొందరు పెద్దోళ్లు స్థలాలను కొనుగోలు చేసి పక్కనే ఉన్న శిఖం భూమిని కూడా ఆక్రమించి ప్రహరీలు నిర్మించారు. అవే చెరువుల్లోని మట్టిని వారి భూముల్లో నింపేశారు. వారంతా సంపన్నవర్గాలు కావడంతో స్థానికులు నోరు మెదపలేకపోతున్నట్లు దుబ్బచర్లకు చెందిన ఓ రైతు చెప్పారు.

నిష్ణాతులు ఉన్నా

నీటి పారుదల శాఖలో నిష్ణాతులైన అనేక మంది ఇంజినీర్లు ఉన్నారు. హెచ్ఎండీఏ మాత్రం ఆర్వీ కంపెనీకి ‘ఎఫ్టీఎల్’ నిర్ధారణ పనులను కట్టబెట్టింది. వాళ్లు ఇష్టారాజ్యంగా చేశారు. ఉదాహరణకు రావిర్యాల శంషాబాద్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలోనే ఉంటుంది. హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో రావిర్యాల చెరువు ఔటర్ రింగు రోడ్డుకు అవతల ఉందని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణాన్ని సగానికి తగ్గించేశారు. రెవెన్యూ రికార్డులకు, ఇప్పుడు వీళ్లు ధ్రువీకరించిన విస్తీర్ణానికి పొంతనే లేదు. దీన్ని అడ్డుపెట్టుకొని బడా సంస్థలు రావిర్యాల చెరువు ఎఫ్టీఎల్ లోనే పెద్ద వెంచర్లను వేశారు. నీటి పారుదల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకొని హెచ్ఎండీఏ ద్వారా అనుమతులు పొందారు. అనుమతులు ఉన్నాయని అమాయక జనం ప్లాట్లు కొనుగోలు చేశారు. తాజాగా కురిసిన వర్షాలకు చెరువు 60 శాతం నిండింది. దాంతోనే ఈ లేఅవుట్లల్లో చాలా వరకు జలమయమయ్యాయి. ఎఫ్టీఎల్ గుర్తింపులో అక్రమాలు జరిగాయని సర్దార్నగర్ మాజీ సర్పంచ్ రాఖేష్ గౌడ్ కలెక్టర్, హెచ్ఎండీఏ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

సెలబ్రిటీలకు భూములు

రావిర్యాల చెరువులో చాలా మందికి ఏక్ సాల్ పట్టా భూములు ఉన్నాయి. నీళ్లు లేనప్పుడు సాగు చేసుకునేందుకు మినహా వాటిని అమ్ముకోవడానికి అవకాశాల్లేవు. సెలెబ్రిటీలు వాటిని కొను గోలు చేశారు. వారిలో బిల్డర్లు, ప్రముఖ హోటళ్ల యజమానులు, క్రికెటర్లు, సినీ స్టార్లు ఉన్నట్లు సమాచారం. క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ భార్య అంజలీ పేరిట ఆరెకరాలు కూడా ఉంది. చాముండే శ్వరీనాథ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పొరుగు రాష్ట్ర సీఎం, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇంకా అనేక మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చే యించుకోలేదని రావిర్యాల, సర్దార్‌నగర్‌ గ్రామస్థులు చెబుతున్నారు. మహేశ్వరం మండలం రావిర్యాల (తుక్కుగూడ మున్సిపాలిటీ), దుబ్బచర్ల, కల్వకోలు గ్రామాల్లోని చెరువులను ఊడ్చేశారు. నీటి పారుదల, హెచ్‌ఎండీఏ శాఖల రికార్డులకు పొంతన లేకుండా విస్తీర్ణాలు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మాకేం తెలియదు

రావిర్యాల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తాముఎవరికీ ఎన్వోసీ ఇవ్వలేదని నీటి పారుదల శాఖ డీఈఈ విక్రం అంటున్నారు. గతంలో కొందరు తీసుకున్న ఎన్వోసీలను రద్దు చేశామని చెబుతున్నా రు. వాళ్లు కోర్టుకెళ్లారని వివరించారు. ప్లాట్లు కొన్న వారి సంగతేం కావాలని అడిగితే ఆ విషయం తమకు తెలియదన్నారు. హెచ్ఎండీఏ నిర్ధారించిన ఎఫ్టీఎల్ తో తమకు సంబంధం లేదన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో లేఅవుట్లు వెలిశాయని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్నారు. చాలా మందికి నోటీసులు జారీ చేశామన్నారు. చెరువుల కట్టలు తెంచినవారిపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు.

రావిర్యాల, సర్దార్‌నగర్‌ పెద్దల జాగా

గ్రామం పట్టాదారు సర్వే నం విస్తీర్ణం
రావిర్యాల డైమాన మరియం కురియన్‌ 217/అ ఒక ఎకరం
రావిర్యాల ఆదిత్యహోమ్స్‌ 191/ఈ, 189/ఈ 7.32 ఎకరాలు
రావిర్యాల ఆర్‌ గోపాల్‌ ఫైనాన్‌ లిమిటెడ్‌ 292/ఇ, 293/ఇ 5.39 ఎకరాలు
రావిర్యాల అంజలి టెండూల్కర్‌ 192 6.2 ఎకరాలు
రావిర్యాల ఎంఎస్‌ శ్రీబసీబేస్‌ ప్రై.లి. 182, 187, 102/ఆ2 7.02 ఎకరాలు
రావిర్యాల వెంకిన చాముండేశ్వరినాధ్‌ 192/ఇ1 ఒక ఎకరం
సర్దార్‌నగర్‌ హెచ్‌పీఆర్‌ ప్రాజెక్టు ప్రై.లి. 105/అ, 106/అ 18.17 ఎకరాలు
సర్దార్‌నగర్‌ సజ్జల ఆగ్రా లిమిటెడ్‌ 10/2, 11/2 32.31 ఎకరాలు
సర్దార్‌నగర్‌ ఆర్కే అసోసియేషన్‌ 3/అ, 3/ఆ/1 4.12 ఎకరాలు
సర్దార్‌నగర్‌ గేట్‌వే ప్రై లిమిటెడ్‌ 53/అ, 54/అ2 9.08 ఎకరాలు

ఇందులో కొన్ని ఈ మధ్యకాలంలో చేతులు మారి ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి.

చెరువుల విస్తీర్ణంలో అధికారిక వ్యత్యాసం

గ్రామం చెరువు సర్వే నెం. విస్తీర్ణం హెచ్‌ఎండీఏ సర్వే ప్రకారం వ్యత్యాసం
దుబ్బచర్ల కళ్లెంచెరువు 59 76.13 ఎ. 48.31 ఎ – 27.82 ఎ
దుబ్బచర్ల ఎర్రగుంట 105 17.04 ఎ. 11.06 ఎ. – 5.38 ఎ
దుబ్బచర్ల రామయ్యకుంట 82 6.21 ఎ. 6.05 ఎ. -0.16 ఎ
కల్వకోలు పెద్ద చెరువు 292 114.23 ఎ. 166 ఎ. + 52.23 ఎ
Advertisement

Next Story