ఇగో.. ప్రపంచాన్ని కదలించిన అద్భుతం

by  |
ఇగో.. ప్రపంచాన్ని కదలించిన అద్భుతం
X

దిశ, ములుగు : తెలుగు జాతిని ఏకం చేసి జనరంజకంగా పాలించిన కాకతీయ రాజుల కాలం నాటి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చెప్పే ఆనవాళ్లలో ప్రధానమైనవి ఆలయాలే. ప్రపంచంలోనే శిల్పి పేరున నిర్మితమైన ఏకైక ఆలయం రామప్ప. ఈ ఆలయం ప్రాచీన కాలం నాటి విశేషాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ శిల్పాల కోసం ఎక్కడి రాళ్లను వినియోగించారు. యంత్రాలు లేని కాలంలో ఎలా తరలించగలిగారు. అనే విషయాలు కూడా ఆసక్తికరమే. ‘ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో. ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో… ‘ అంటూ వర్ణించాడో సినీకవి. అద్భుత శిల్ప సంపదతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న రామప్ప దేవాలయాన్ని చూసిన తర్వాత తన మదిలో కలిగిన అనుభూతులకు అక్షర రూపం ఇచ్చిన ఆ కవి మాటలు అక్షర సత్యాలని రామప్పలో ఉన్న శిల్పాలను చూస్తే తెలుస్తుంది.

802 ఏళ్ల చరిత్ర కు సజీవ సాక్షం రామప్ప

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని 1213లో కాకతీయుల కాలంలో వారి సేనాని రేచర్ల రుద్రయ్య నిర్మించారు. 802 సంవత్సరాలు పూర్తి కాగా నేటికీ రామప్ప ఆలయ శిల్పాల అందాలు కనువిందు చేస్తున్నాయి. నక్షత్రాకార పీఠం పై రామప్ప ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణం కోసం భారీ బండరాళ్లను ఉపయోగించారు. ప్రధాన ఆలయంలోని శివలింగం, నాలుగు భారీ స్తంభాలు, గర్భగుడి ప్రవేశ ద్వారము, గర్భగుడి చుట్టూ కనిపించే పన్నెండు అందమైన స్త్రీల విగ్రహాలు (మదనికలు /సాలభంజికలు ), 28 ఏనుగు, సింహం విగ్రహాలు, అందంగా కనిపించే భారీ నంది విగ్రహం నల్లసేనాపు రాయితో చేసారు. ఈ రాళ్లను ఎక్కడనుంచి తెచ్చారో స్పష్టత లేదు. రామప్ప ను ఆనుకొని ఉన్న కాటేశ్వర, కామేశ్వర ఆలయంతో పాటు పాలంపేట పరిధిలో 20 వరకు ఉప ఆలయాలు కనిపిస్తాయి. ఇవన్నీ నిర్మించేందుకు ఇక్కడి గుట్టలపై ఉన్న రాళ్లను వాడినట్లు తెలుస్తుంది.

వరాల గుట్ట, గుట్టల్లో ఆనవాళ్లు…

సరస్సు నిర్మాణం వాన గుట్ట, వరాల గుట్టల మధ్యలో వేసిన ఆనకట్ట తో సాధ్యమైంది. వరాల గుట్టపై భాగంలో చుట్టు రాళ్లతో పేర్చిన ఆరు అడుగుల కోట కూడా సుమారు 20 ఎకరాల స్థలంలో కనిపిస్తుంది. వాన గుట్ట కింది నుంచి పై వరకు భారీ రాళ్లను తరలించే ముందు పగుళ్ళకు గురి కాకుండా ఉండేందుకు చిన్న చిన్న రంధ్రాలు చేసి కావలసిన విధంగా కొలతలు సిద్ధం చేసిన ఆనవాళ్లు నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల సహాయం లేకుండా ఎంతో ఎత్తయిన ప్రాంతం నుంచి భారీ రాళ్లను కిందకు దింపడంతో పాటు వాటిని ఆలయాలు నిర్మించే ప్రాంతాలకు తరలించే విధానం నిజంగా అద్భుతమే….

40 ఏళ్ళు కొనసాగిన ఆలయ నిర్మాణం

రామప్ప దేవాలయ నిర్మాణం శాసనం ప్రకారం క్రీస్తు శకం 1173లో ప్రారంభమై 1213లో పూర్తయినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ళ పాటు కొనసాగిన ఆలయ పనులు ప్రధాన శిల్పి రామప్ప పర్యవేక్షణలో జరిగినట్లు స్పష్టమవుతోంది. భారీ రాళ్లను తరలించడంలో సహకరించిన ఏనుగులకు శిల్పి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నించాడు. దీని కోసం కొన్ని భారీ ఏనుగుల విగ్రహాలను చెక్కడంతో పాటు సందర్శకులకు ఆలయ దర్శనాన్ని, చుట్టూ తిరిగే విధానాన్ని చూపేలా వివిధ ఆకృతుల్లో చెక్కిన 526 ఏనుగుల చిత్రాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఎందరో శిల్పులు, ప్రజలు, జంతువుల శ్రమకు ఈ ప్రాంతం లోని ఆలయాలు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

Next Story

Most Viewed