‘మూసీ’ పాయె.. కబ్జాలతో బోసిపోయె!

by Shyam |
‘మూసీ’ పాయె.. కబ్జాలతో బోసిపోయె!
X

దిశ, హైదరాబాద్:
రాష్ట్రంలో అత్యంత చారిత్రాత్మకమైన మూసీ నదిని సుందరీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మూసీని శుద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పేషన్‌ను ఏర్పాటు చేసినా అందుకు నిధులు కేటాయించినా.. పనులు మాత్రం ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలును ప్రారంభించిన మరుసటి రోజే.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పేషన్ చైర్మన్‌గా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నిమించడంతో మూసీ మరోసారి వార్తల్లో కెక్కింది. హైదరాబాద్ నగరాభివృద్ధికి మొత్తం రూ.50 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా, ప్రతి ఏట రూ.10 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆక్రమణలతో కుచించుకుపోతూ..

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీనది.. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ, న్యూ సిటీలకు మధ్యలో ఉంటుంది. ఒక్క హైదరాబాద్ సిటీలోనే దాదాపు 13 కిలోమీటర్లు పారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 12 రెవెన్యూ మండలాల పరిధిలో సుమారు 13 కిలోమీటర్ల పొడవు వరకు మూసీ నది వ్యాపించి ఉంది. రాజేంద్రనగర్, గండిపేట, గోల్కొండ, ఆసిఫ్ నగర్, బహదూర్ పురా, నాంపల్లి, హిమాయత్ నగర్, చార్మినార్, అంబర్ పేట, సైదాబాద్ అనంతరం నాగోల్, ఉప్పల్ కలాన్ మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఒకప్పడు జంట నగరాలవాసులకు మంచినీరు అందించిన ఘనత మూసీ నదిదే. ప్రస్తుతం నగరంలో నివాసితుల భవనాల నుంచే వచ్చే మురికి నీటితో మూసీ మురికి కూపంగా మారింది. అంతే కాదు.. మూసీకి అటూ, ఇటూ పరీవాహక ప్రాంతమంతా ఆక్రమణలకు గురైంది. అనుమతులు లేని నిర్మాణాలు వేలాదిగా వెలిశాయి. ఫలితంగా మూసీ కుంచించుకుపోతోంది.

సమగ్ర నివేదికపై కసరత్తు..

రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తేగానే, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వారంలోగా మూసీ వివరాలన్నీ అందజేయాలని ఆదేశించారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాలకు చెందిన మండలాల తహసీల్దార్లు మూసీ వివరాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో హైదరాబాద్ డివిజన్‌లోని బండ్లగూడ మండలం మినహా.. గోల్కొండ, బహదూర్ పురా, ఆసిఫ్ నగర్, నాంపల్లి, హిమాయత్ నగర్, చార్మినార్, అంబర్ పేట, సైదాబాద్ మండలాల తహసీల్దార్లు తమ రెవెన్యూ పరిధిలో మూసీ విస్తరణం, టౌన్ సర్వే (టీఎస్) నంబర్లు, ఆక్రమణలు తదితర వివరాలతో పాటు గూగూల్ మ్యాప్‌ను కూడా సిద్దం చేస్తున్నారు. కలెక్టర్‌కు మూసీ నివేదిక అందిన తర్వాత, ప్రక్షాళనలో భాగంగా మూసీ ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి మరి!

Tags : musi river, hyderabad musi river, musi river kabja, musi nadi kabja

Advertisement

Next Story

Most Viewed