ఒంటిమిట్ట ఖాళీ.. నీరసంగా శ్రీరామ కల్యాణం

by srinivas |
ఒంటిమిట్ట ఖాళీ.. నీరసంగా శ్రీరామ కల్యాణం
X

కరోనా రక్కసి దేశంలోకి, తెలుగు రాష్ట్రాల్లోకి జొరబడకుండా ఉండి వుంటే నేడు శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగి ఉండేవి. వాడవాడలా రామాలయాలు భక్తులతో కిటకిటలాడేవి. మధ్యాహ్నం వడపప్పు, బెల్లంపానకం అన్న ప్రసాదాల వితరణతో సందడిగా మారేవి. కానీ ఈ మహమ్మారి కారణంగా.. ఎటువంటి ఆర్భాటాలు, సందడి లేకుండానే కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో అధికారులు భక్తులకు అనుమతి నిరాకరించారు. దీంతో అర్చకుల సమక్షంలో కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. ఆపై ఆగమశాస్త్ర ప్రకారం, పుట్టమన్నును తీసుకుని వచ్చి, బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఉదయం 9 గంటల సమయంలో ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు, నేటి రాత్రి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. 7వ తేదీ రాత్రి, పున్నమి వెన్నెల కాంతుల్లో స్వామివారి కల్యాణాన్ని కూడా పరిమిత సంఖ్యలో హాజరయ్యే పూజారులు, అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని ఆలయాధికారులు తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు కిక్కిరిసిపోయే ఒంటిమిట్ట, ఇప్పుడు భక్తులు కనిపించక బోసిపోయింది.

శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తిరుమల శ్రీవారి గర్భాలయంలో సీతారామలక్ష్మణ విగ్రహాలు ఉన్నాయని, ఈ ఏడాది ఆ విగ్రహాలకు అభిషేకం జరిపి ఆస్థానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 7న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు తమ ఇళ్ల నుంచే రాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన చెప్పారు. 2వ తేదీ అంటే రేపటి నుంచి 11 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఎలాంటి లోపాల్లేకుండా నిర్వహిస్తామని తెలిపారు.

ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 10 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థాన వేడుక నిర్వహించనున్నారు. రేపు రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. వైరస్ కలవరపెడుతుండడంతో ఈ వేడుకలన్నీ పండితుల సహకారంతో ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Tags: vontimitta ramalayam, kadapa district, sri rama kalyanam, seetharamula kalyanam, ttd, yv subbareddy

Advertisement

Next Story

Most Viewed