Paris Olympics : ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ఆ క్రీడలు షురూ

by Harish |
Paris Olympics : ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ఆ క్రీడలు షురూ
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌ అధికారిక ప్రారంభానికి రెండు రోజుల ముందే మొదలయ్యాయి. అధికారికంగా శుక్రవారం నుంచి విశ్వక్రీడలకు తెరలేవనుంది. బుధవారం పురుషుల విభాగంలో ఫుట్‌బాల్, రగ్బీ సెవెన్స్ గ్రూపు మ్యాచ్‌లు జరిగాయి. తొలి రోజే ఒలింపిక్స్‌లో సంచలనం నమోదైంది. ఫుట్‌బాల్‌లో వరల్డ్ చాంపియన్ అర్జెంటీనాకు మొరాకో షాకిచ్చింది. వివాదాస్పదమైన గ్రూపు బి మ్యాచ్‌లో అర్జెంటీనాపై 1-2 తేడాతో మొరాకో విజయం సాధించింది. సోఫియానే రహీమి రెండు గోల్స్‌తో మొరాకో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫస్టాఫ్‌లో 47వ నిమిషంలో తొలి గోల్ చేసిన అతను.. సెకాండాఫ్‌లో 49వ నిమిషంలో మరో గోల్ చేశాడు. అర్జెంటీనా తరపున 68వ నిమిషంలో సిమియోన్ గిలియానో గోల్ చేసి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. అదనపు సమయంలో అర్జెంటీనా ప్లేయర్ క్రిస్టియన్ మదీన గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. అయితే, మొరాకో ప్లేయర్లు వెంటనే ఆఫ్ సైడ్‌ గోల్‌గా పరిగణించాలని పట్టుబట్టారు. మ్యాచ్ ముగియకముందే మొరాకో పూర్తి జట్టు మైదానంలోకి రావడంతో రిఫరీ మ్యాచ్‌ను సస్పెండ్ చేశాడు. దాదాపు గంట తర్వాత మిగతా మ్యాచ్ నిర్వహించారు. రిఫరీ అర్జెంటీనా గోల్‌ను ఆఫ్‌ సైడ్‌గా తీర్పు ఇచ్చి ఆ గోల్‌ను పరిగణించలేదు. ఆఖర్లో అర్జెంటీనా మరో గోల్ చేయలేకపోవడంతో మొరాకో విజయం సాధించింది.



Next Story