Paris Olympics : ఓ సామాన్య రైతు కొడుకు.. సరబ్‌జోత్ సింగ్ నేపథ్యం ఇదే

by Harish |
Paris Olympics : ఓ సామాన్య రైతు కొడుకు.. సరబ్‌జోత్ సింగ్ నేపథ్యం ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : ఎక్కడ కోల్పోయామో అక్కడే వెత్కుకోవాలనే సామెతకు పర్ఫెక్ట్ ఉదాహరణ సరబ్‌జోత్ సింగ్. తొలి ఒలింపిక్స్‌లోనే బ్రాంజ్ మెడల్ సాధించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అయితే, ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అతనికి ఆరంభం కలిసిరాలేదు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత ఈవెంట్‌లో తృటిలో ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయాడు. టాప్-8 షూటర్లు ఫైనల్‌కు చేరుకుంటారు. సరబ్‌జోత్, జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ 577 స్కోర్లతో సమంగా నిలిచారు. అయితే, సరబ్‌జోత్‌ కంటే జర్మనీ అథ్లెట్ ఒకటి అదనంగా ‘ఎక్స్’ వద్ద షూట్ చేయడంతో అతను ముందుకు వెళ్లాడు. దీంతో సరబ్‌జోత్ 9వ స్థానంతో సరిపెట్టాడు. ఈ ఈవెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత అతను తన కల నిజం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను బాకర్‌తో కలిసి కాంస్యం సాధించాడు.

ఎవరీ సరబ్‌జోత్ సింగ్

భారత షూటింగ్‌లో గతేడాది నుంచి సరబ్‌జోత్ సింగ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గతేడాది ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ టీమ్, మిక్స్‌డ్ టీమ్‌ ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించిన భారత జట్లలో అతను సభ్యుడు. అతని నేపథ్యం గురించి చెప్పాలంటే.. సరబ్‌జోత్ సింగ్ ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. హర్యానా రాష్ట్రంలోని అంబాలా జిల్లా ధీనా జాట్ గ్రామం అతని పుట్టిన ఊరు. అతని తండ్రి జతీందర్ సింగ్ ఓ సాధారణ రైతు. తల్లి హర్దీప్ కౌర్. చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీలో విద్యను అభ్యసించాడు. ఓ వైపు చదువుతూనే షూటింగ్‌లో రాణించాడు.

ఫుట్‌బాలర్‌ కావాలనుకుని..

షూటింగ్‌పై సరబ్‌జోత్‌కు 13ఏళ్ల వయసులో ఇష్టం ఏర్పడింది. సమ్మర్ క్యాంప్‌లో పిల్లలు ఎయిర్ గన్‌లు పట్టుకోవడం అతను మొదటిసారి చూశాడు. అప్పటి వరకు అతను ఫుట్‌బాలర్ కావాలని కలలు కన్నాడు. ఆ తర్వాత షూటింగ్‌‌పై మక్కువ పెంచుకున్నాడు. ఆ విషయాన్ని తండ్రికి చెబితే.. ‘షూటింగ్ ఖర్చుతో కూడుకున్నది. ఓ రైతుకు ఇంకా కష్టం.’ అని అతనికి సర్దిచెప్పేందుకు చూశాడు. కానీ, సరబ్‌జోత్ షూటింగ్‌‌ గురించే ఆలోంచించాడు. నెలల తరబడి పట్టుబట్టాడు. తన తండ్రిని ఒప్పించాడు. ఒకవైపు చదువుతూనే కోచ్ అభిషేక్ రానా వద్ద రాటుదేలాడు. 2019 జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణం సహా మూడు పతకాలు గెలిచాడు. అదే ఏడాది సీనియర్ విభాగంలో ఏషియన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కాంస్యం సాధించాడు. ఆ తర్వాత 2021లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక, గతేడాది వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు, ఏషియన్ గేమ్స్‌లో ఓ స్వర్ణం, రజతం గెలుచుకున్నాడు.

Advertisement

Next Story