యూపీపై ప్రతీకారం తీర్చుకున్న ముంబై.. అలవోకగా విజయం

by Harish |
యూపీపై ప్రతీకారం తీర్చుకున్న ముంబై.. అలవోకగా విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. యూపీ వారియర్స్‌ను చిత్తుగా ఓడించి తొలి గ్రూపు మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో యూపీ‌పై 42 పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. ముంబై జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో యూపీ జట్టు 118/9 స్కోరుకే పరిమితమైంది. ముంబై బౌలర్ల ధాటికి యూపీ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. అలీస్సా హీలీ(3), కిరణ్ నవ్‌గిరే(7), చమరి ఆటపట్టు(3), గ్రేస్ హ్యారిస్(15), శ్వేతా సెహ్రావత్(17) నిరాశపర్చడంతో యూపీ జట్టు 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో దీప్తి శర్మ(53 నాటౌట్) ఒంటరి పోరాటం చేసింది. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి ఆమె హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కానీ, మరో ఎండ్‌లో వికెట్లు నిలువలేదు. దీంతో దీప్తి శర్మ చివరి వరకు పోరాడటంతో యూపీ జట్టు కష్టంగా 100 పరుగుల మార్క్‌ను దాటింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ 3 వికెట్లు తీసింది. బ్యాటుతో కీలక ఇన్నింగ్స్ ఆడిన నాట్ స్కివర్ బ్రంట్ 2 వికెట్లు పడగొట్టింది. హేలీ మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజ వస్త్రాకర్, సజనలకు చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో ముంబై రెండో స్థానానికి చేరుకుంది.

మెరిసిన నాట్ స్కివర్ బ్రంట్

అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు యాస్తికా భాటియా(9), హేలీ మాథ్యూస్(4) నిరాశపర్చడంతో 17 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. ఈ సమయంలో నాట్ స్కివర్ బ్రంట్(45) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(33), అమేలియా కెర్(39), సజన(22 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. దీంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 160/6 స్కోరు చేసింది. యూపీ బౌలర్లలో ఆటపట్టు రెండు వికెట్లు తీయగా.. గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్‌లకు చెరో వికెట్ దక్కింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 160/6(20 ఓవర్లు)

(నాట్ స్కివర్ బ్రంట్ 45, అమేలియా కెర్ 39, హర్మన్‌ప్రీత్ కౌర్ 33, సజన 22, ఆటపట్టు 2/27)

యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ : 118/9(20 ఓవర్లు)

(దీప్తి శర్మ 53 నాటౌట్, సైకా ఇషాక్ 3/27, నాట్ స్కివర్ బ్రంట్ 2/14)

Advertisement

Next Story

Most Viewed