అర్చరీ వరల్డ్ కప్‌లో తెలుగమ్మాయి సురేఖ జోడీకి స్వర్ణం

by Sathputhe Rajesh |
అర్చరీ వరల్డ్ కప్‌లో తెలుగమ్మాయి సురేఖ జోడీకి స్వర్ణం
X

షాంఘై : అర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మరో భారత స్టార్ క్రీడాకారుడు ఒజస్ దేవ్‌తలెతో కలిసి స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత ద్వయం 156-155 తేడాతో టాప్ సీడ్, కొరియాకు చెందిన కిమ్ జోంఘె-ఓహ్ యోహ్యున్ జోడీని చిత్తు చేసింది. ఆరంభం నుంచే హోరాహోరీగా తలపడిన ఇరు జట్లు మొదటి మూడు రౌండ్లలోనూ ఇరు జట్లు 40కిగానూ 39 పాయింట్లు సాధించి 117-117తో సమంగా నిలిచాయి. అయితే, చివరి రౌండ్‌లో 38-39 తేడాతో భారత్‌ పైచేయి సాధించి విజేతగా నిలిచింది. జ్యోతి చివరి బాణాన్ని 10 మార్క్‌ను గురి చూసి సంధించడంతో విజయం భారత్‌నే వరించింది. గత నెలలో ఆంటల్వాలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-1లో విజేతగా నిలిచిన తర్వాత దేవ్‌తలె, సురేఖ జోడీ వరుసగా స్వర్ణం గెలిచింది.

అలాగే, పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో ప్రథమేశ్ జావ్కర్ సంచలనం సృష్టించాడు. ఫైనల్‌లో ఏకంగా వరల్డ్ నం.1 మైక్ ష్లోసర్‌ను చిత్తు చేసి స్వర్ణం సాధించాడు. ఫైనల్‌లో ప్రథమేశ్ 149-148 తేడాతో నెదర్లాండ్స్ స్టార్ మైక్ ష్లోసర్‌పై విజయం సాధించాడు. తుది పోరులో అద్భుతంగా రాణించిన భారత యువ సంచలనం 15 బాణాల్లో 14 బాణాలతో 10 పాయింట్లను రాబట్టడం విశేషం. నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి 119-119 స్కోరు‌తో ఇరువురు సమంగా నిలువగా.. ఆఖరి రౌండ్‌లో ప్రథమేశ్ 30-29 తేడాతో వరల్డ్ నం.1కు షాకిచ్చి విజేతగా నిలిచాడు. అలాగే, మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అవ్‌నీత్ కౌర్ 147-144 తేడాతో తుర్కియేకు చెందిన ఇపెక్ టోమ్రుక్‌పై గెలిచి కాంస్య పతకం సాధించింది. దాంతో భారత్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకంతో వరల్డ్ కప్ స్టేజ్-2ను ముగించింది.

Advertisement

Next Story

Most Viewed