ఆసీస్‌ను కంగారు పెట్టిన భారత బౌలర్లు

by John Kora |
ఆసీస్‌ను కంగారు పెట్టిన భారత బౌలర్లు
X

- రాణించిన స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ

- భయపెట్టిన ట్రావిస్ హెడ్

- ఆస్ట్రేలియా 264 ఆలౌట్

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియా జట్టును భారత బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. దీంతో ఆసీస్ 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దుబాయ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీస్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మాథ్యూ షార్ట్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కూపర్ కనోలీ (0) ఖాతా తెరవకుండానే మహ్మద్ షమీ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుక పడ్డాడు. ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ హెడ్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్(39) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కాసేపు వికెట్లు పడకుండా పరుగులు రాబట్టారు. లబుషేన్ (29) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. జోష్ ఇంగ్లీష్ (11) కూడా తక్కువ పరుగులకే పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌తో కలిసి అలెక్స్ కేరీ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతుండటంతో ఒక దశలో ఆసీస్ జట్టు 300 పరుగులు దాటేలా కనిపించింది. స్టీవ్ స్మిత్ (73)ను షమీ బౌల్డ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. డ్వార్‌షుష్ (19) పరుగుల వేగం పెంచే క్రమంలో అవుటయ్యాడు. ప్రమాదకరంగా కనిపించిన అలెక్స్ కేరీ (61) రనౌట్ అవడంతో ఆస్ట్రేలియా పూర్తిగా డీలా పడింది. టెయిలెండర్లు జంపా (7), నాథన్ ఎల్లిస్ (10)లు కూడా చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా 2, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.

స్కోర్ బోర్డు :

ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) వరుణ్ చక్రవర్తి 39, కూపర్ కనోలీ (సి) కేఎల్ రాహుల్ (బి) మహ్మద్ షమి 0, స్టీవ్ స్మిత్ (బి) మహ్మద్ షమి 73, మార్నస్ లబుషేన్ (ఎల్బీడబ్ల్యూ)(బి) రవీంద్ర జడేజా 29, జోష్ ఇంగ్లీష్ (సి) కోహ్లీ (బి) రవీంద్ర జడేజా 11, అలెక్స్ కేరీ రనౌట్ 61, మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ పటేల్ 7, డ్వార్‌షుయస్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) వరుణ్ చక్రవర్తి 19, ఆడమ్ జంపా (బి) హార్దిక్ పాండ్యా 7, నాథన్ ఎల్లిస్ (సి) కోహ్లీ (బి) మహ్మద్ షమీ 10, టి సంగా 1 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 7; మొత్తం 264/10 (49.3 ఓవర్లు)

వికెట్ల పతనం : 4-1, 54-2, 110-3, 144-4, 198-5, 205-6, 239-7, 249-8, 262-9, 264-10

బౌలింగ్ : మహ్మద్ షమీ (10-0-48-3), హార్దిక్ పాండ్యా (5.3-0-40-1), కుల్దీప్ యాదవ్ (8-0-44-0), వరుణ్ చక్రవర్తి (10-0-49-2), అక్షర్ పటేల్ (8-1-43-1), రవీంద్ర జడేజా (8-1-40-2)

Next Story