కివీస్ తో టెస్టులో 46పరుగులకే టీమిండియా ఆలౌట్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-17 08:19:26.0  )
కివీస్ తో టెస్టులో 46పరుగులకే టీమిండియా ఆలౌట్
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 31,2ఓవర్లలో 46పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియాకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 1987లో వెస్టిండీస్ పై 75 పరుగులు చేసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో టాప్ అర్డర్ బ్యాటర్లతో సహా ఆటగాళ్లంతా కివీస్ పేసర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. రిషబ్ పంత్ చేసిన 20పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి రోజు ఆట అంతా వర్షంతో టాస్ వేయకుండానే వృథా అయ్యింది. రెండోరోజు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పు చేసింది. ఆట ప్రారంభంలోనే కెప్టన్, ఓపెనర్ రోహిత్ శర్మ(2) తొలి వికెట్ గా పెవిలియన్ చేరగా, కోహ్లీ, సర్ఫరాజ్ లు డకౌట్ గా వెనుతిరిగారు.

అనంతరం లోకల్ హీరో కెఎల్. రాహుల్, జడేజాలు కూడా డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13పరుగులకు అవుటయ్యాడు. లంచ్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి34 పరుగులు మాత్రమే చేసింది. లంచ్ తర్వాత టీమిండియా భారీ ఆశలు పెట్టుకున్న అశ్విన్ కూడా డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే పంత్ 20, కుల్ధీప్ యాదవ్ 2, బూమ్రా 1, సిరాజ్ 4పరుగులకే పెవిలియన్ చేరారు. కివీస్ పేసర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీయగా, విలియం ఓ రూర్కీ 4, సౌథీ 1 వికెట్లు సాధించి టీమిండియాను స్వల్ప స్కోరుకే కుప్పకూల్చారు. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగుతుంది. ఓపెనర్లు టామ్ లాథమ్(6), డెవిడ్ కాన్వే (4)పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed