గ్రౌండ్‌లోనే బంగ్లా స్టార్ క్రికెటర్‌కు రెండుసార్లు హార్ట్ ఎటాక్.. డాక్టర్లు ఏమన్నారంటే?

by Harish |
గ్రౌండ్‌లోనే బంగ్లా స్టార్ క్రికెటర్‌కు రెండుసార్లు హార్ట్ ఎటాక్.. డాక్టర్లు ఏమన్నారంటే?
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్‌ లీగ్‌ ఆడుతుండగా అతనికి గుండె పోటు వచ్చింది. రెండు సార్లు హార్ట్ ఎటాక్ రావడంతో పరిస్థితి విషమించగా.. అత్యవసర సర్జరీ చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తమిమ్ దేశవాళీలో మాత్రం ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్‌ లీగ్‌లో భాగమైన అతను మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.

సోమవారం షైనేపుకుర్ క్రికెట్ క్లబ్‌తో ఆడుతుండగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను అస్వస్థతకు గురయ్యాడు. చెస్ట్‌లో తీవ్ర నొప్పితో మైదానం వీడాడు. వెంటనే దగ్గరిలో ఉన్న కేపీజే హాస్పిటల్‌కు తరలించగా.. స్వల్ప గుండెపోటుగా గుర్తించారు. అతన్ని ఎయిర్ అంబులెన్స్‌లో ఢాకాకు తరలించే ప్రయత్నం చేస్తుండగా మరోసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో మహమ్మదన్ టీమ్ ఫిజియో అతనికి సీపీఆర్ చేసి తిరిగి అదే హాస్పిటల్‌కు తరలించారు.

అప్పటికే తమిమ్ పరిస్థితి విషమంగా మారిందని కేపీజే హాస్పిటల్ డాక్టర్ రజీబ్ హసన్ వెల్లడించారు. వెంటనే యాంజియోగ్రామ్, యాంజీయోప్లాస్టీ చేశామని, ప్రస్తుతం అతను అబ్జర్వేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. తమిమ్ స్పృహలోకి వచ్చినట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ(బీసీబీ) చీఫ్ ఫిజిషియన్ దేబాశీష్ చౌదరి ధ్రువీకరించారు. మరో 24 గంటల్లో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు. కాగా, బంగ్లా మాజీ కెప్టెన్ అయిన తమిమ్ ఇక్బాల్ 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టెస్టులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 15, 249 రన్స్ చేశాడు.




Next Story