టీ20ల్లో నం.1 బ్యాటర్‌గా సూర్య ర్యాంక్ పదిలం

by Dishanational3 |
టీ20ల్లో నం.1 బ్యాటర్‌గా సూర్య ర్యాంక్ పదిలం
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ టీ20ల్లో నం.1 బ్యాటర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సూర్య ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో అతను గతేడాది డిసెంబర్‌లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. సౌతాఫ్రికాలో గాయం కారణంగా ఆటకు దూరమైన అతను ఐపీఎల్‌తో పునరాగమనం చేశాడు. ఐదు నెలలుగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని సూర్య టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోవడం గమనార్హం.

భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 6వ స్థానంలో కొనసాగతుండగా.. రుతురాజ్ గైక్వాడ్ 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉండగా.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. జింబాబ్వేపై సత్తాచాటిన బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, మహేది హసన్ తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. మహేది, తస్కిన్ చెరో ఆరు స్థానాలు వెనక్కినెట్టి 22వ, 26వ ర్యాంక్‌ల్లో నిలిచారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20ల్లో నం.1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా 7వ స్థానంలో, అక్షర్ పటేల్ 19వ స్థానంలో ఉన్నారు.

Next Story