యాషెస్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు షాక్..!

by Shiva |
యాషెస్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు షాక్..!
X

స్టార్ వెటరన్ పేసర్ అండర్సన్‌ కు గాయం

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన యాషెస్ లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ ఏడాది స్వదేశంలో బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతున్న ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది జూన్ 16 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగబోయే యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆ జట్టు స్టార్ పేసర్లు వరుసగా గాయాల పాలవుతున్నారు.

ప్రధానంగా ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ గాయపడడం ఆ జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇంగ్లాండ్ లో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న అండర్సన్ లంకాషైర్ వర్సెస్ సోమర్‌సెట్ మ్యాచ్ లో గాయపడ్డాడు. మాంచెస్టర్ ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా సోమర్‌సెట్ తో జరిగిన మ్యాచ్ లో ఆండర్సన్ 14 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మొదటి రోజు 14 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత అండర్సన్ మళ్లీ తిరిగి ఫీల్డ్ లోకి రాలేదు. కుడి కాలి గజ్జల్లో గాయం కారణంగా అతడు మళ్లీ బౌలింగ్ కు దిగలేదు కూడా. కాగా, జేమ్స్ అండర్సన్ గాయంపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దృష్టి సారించింది.

వచ్చే నెల 1 నుంచి ఇంగ్లాండ్ జట్టు ఐర్లాండ్ తో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కు మాత్రం అండర్సన్ ను దూరంగా ఉంచాలని ఈసీబీ భావిస్తుందని సమాచారం. ఈసీబీ వర్గాల సమాచారం మేరకు జేమ్స్ అండర్సన్ కు గాయం తీవ్రత బాగానే ఉందని అతడు వచ్చే యాషెస్ లోపు కోలుకోవడం కూడా అనుమానమేనని తెలుస్తుంది. బర్మింగ్‌‌హామ్ వేదికగా జూన్ 16 నుంచి జరగబోయే యాషెస్ ఫస్ట్ టెస్టు వరకు అండర్సన్ అందుబాటులోకి ఉండకపోతే ఇంగ్లాండ్ జట్టుకు తిప్పలు తప్పేలా లేవని క్రికెట్ విష్లేశకుల అంచనా.

Advertisement

Next Story

Most Viewed