WPL 2025 : చెలరేగిన గార్డ్‌నెర్.. ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమి

by Harish |
WPL 2025 : చెలరేగిన గార్డ్‌నెర్.. ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మళ్లీ షాక్. వరుసగా మూడు పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు, వరుసగా రెండు ఓటముల తర్వాత గుజరాత్ గాడినపడింది. బెంగళూరు వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 125/7 స్కోరు చేసింది. కనిక ఆహుజ(33) టాప్ స్కోరర్. అనంతరం 126 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గార్డ్‌నెర్(58) హాఫ్ సెంచరీ మెరిసి విజయాన్ని తేలికచేసింది. లిచ్‌ఫీల్డ్(30 నాటౌట్) కూడా రాణించింది.

ఆర్సీబీ కట్టడి

గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి వరకూ సప్పగానే సాగింది. ఆ జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇన్నింగ్స్‌లో జోష్ తీసుకరాలేకపోయారు. తనూజ, డెయాండ్రా డాటిన్ రెండేసి వికెట్లతో రాణించగా.. మిగతా బౌలర్లు కూడా తోడవడంతో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. తొలి ఓవర్‌లోనే వ్యాట్ హోడ్జ్(4) వికెట్ల ముందు దొరికిపోగా.. ఆ తర్వాతి ఓవర్‌లో పెర్రీ(0) డకౌటైంది. కాసేపటికే కెప్టెన్ స్మృతి మంధాన(10)ను తనూజ పెవిలియన్ పంపడంతో 25 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. అనంతరం కనిక(33),రఘ్వి బెస్ట్(22) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాసేపు గుజరాత్ బౌలర్లను నిలువరించారు. కానీ, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ అవుటవ్వగా.. రిచా ఘోష్(9) కూడా ఆకట్టుకోలేకపోయింది. జార్జియా వారేహ్(20 నాటౌట్), కిమ్ గార్త్(14) విలువైన స్కోరు జత చేయడంతో ఆర్సీబీ కష్టంగా 125 స్కోరు చేసింది.

చెలరేగిన గార్డ్‌నెర్

ఛేదనలో గుజరాత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బెత్ మూనీ(17), హేమలత(11), హర్లీన్ డియోల్(5) నిరాశపరిచారు. అయితే, కెప్టెన్ గార్డ్‌నెర్ మాత్రం చెలరేగి ఆడింది. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు దంచింది. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అయితే, కాసేపటికే ఆమె అవుటవ్వగా.. అప్పటికే గుజరాత్ విజయానికి చేరువైంది. మరో ఎండ్‌లో ధాటికి ఆడిన లిచ్‌ఫీల్డ్ మిగతాపని పూర్తి చేసింది.

Next Story