రిహార్సల్స్‌ ఉండవు.. ప్రతి మ్యాచ్ ముఖ్యమే : రోహిత్ శర్మ

by Harish |
రిహార్సల్స్‌ ఉండవు.. ప్రతి మ్యాచ్ ముఖ్యమే : రోహిత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : రిహార్సల్స్ ఉండవని, ప్రతి మ్యాచ్ ముఖ్యమేనని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్ ఇండియా సన్నద్ధమవుతున్నది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్‌కు ఈ సిరీస్‌ కీలకం కానుంది. చెన్నయ్ వేదికగా ఈ నెల 19 నుంచి 23 వరకు తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ పలు విషయాలు వెల్లడించాడు. ‘ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉండవు. ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఎక్కడ ఆడుతున్నామన్నది విషయం కాదు. విజయమే ముఖ్యం.’ అని తెలిపాడు. ఎలా ఆడాలనుకుంటున్నామో దాని ఆధారంగా జట్టును ఎంచుకుంటామని, అప్పుడే విజయం సాధిస్తామని చెప్పాడు. ఆటగాళ్ల గత ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటామని, అత్యుత్తమ ఆటగాళ్లు అందరూ ఆడాలనే ఉంటుందని, కానీ అది సాధ్యం కాదన్నాడు.

అలాగే, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్ గురించి మాట్లాడుతూ..‘వాళ్లు మూడు ఫార్మాట్లు ఆడగలరు. గత సిరీస్‌లో జైశ్వాల్ మంచి ప్రదర్శన చేశాడు. ఒత్తిడిలోనూ జురుల్ పరుగులు రాబట్టగలడు. సర్ఫరాజ్ నిర్భయంగా బ్యాటింగ్ చేస్తాడు. నిర్భయంగా, జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండే ఆటగాళ్లు భారత జట్టులో ఉండటం మంచి సంకేతం.’ అని తెలిపాడు. కోచింగ్ స్టాఫ్‌పై స్పందిస్తూ..‘నాకు గంభీర్, అభిషేక్ నాయర్ చాలా కాలంగా తెలుసు. మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డోస్చాట్‌లతో కూడా కలిసి ఆడాను. కొత్త సపోర్టింగ్ స్టాఫే. కానీ, ఎలాంటి సమస్య లేదు. ప్రతి సపోర్టింగ్ స్టాఫ్ తమ సొంత ఆపరేటింగ్ స్టైల్‌ను కలిగి ఉంటుంది. మేము ఆశించేది కూడా అదే. వారి దృక్పథాలు ఉన్నాయని అర్థం చేసుకోవడం, సర్దుబాటు అవడం ముఖ్యం.’ అని చెప్పాడు. బంగ్లాదేశ్‌తో సవాల్ గురించి మాట్లాడుతూ..‘ప్రతి జట్టు భారత్‌ను ఓడించాలనుకుంటుంది. దాన్ని వాళ్లు ఆనందిస్తారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో చాలా మాట్లాడారు. మేము వాటిపై దృష్టి పెట్టం. ప్రత్యర్థి గురించి ఎక్కువ ఆలోచించం. ఆ ఆటపైనే ఫోకస్ పెడతాం.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

రాహుల్‌‌‌పై కీలక వ్యాఖ్యలు

కేఎల్ రాహుల్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘తనను తాను అర్థం చేసుకోవడం, జట్టుకు తన నుంచి ఏం కావాలో తెలుసుకోవడం కీలకం. రాహుల్ నాణ్యమైన ఆటగాడని అందరికీ తెలుసు. మా నుంచి అతనికి ఒక్కటే సందేశం. అతను అన్ని గేమ్‌లు ఆడటంతోపాటు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. తన నుంచి తనకు ఏం కావాలో అతనికి తెలియాలి. టెస్టుల్లో అతను రాణించకపోవడానికి కారణమెంటో నాకు కనిపించడం లేదు. అవకాశాలు ఉన్నాయి. తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవడం అతనికి చాలా ముఖ్యం.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed