బయట నుంచి వచ్చే ఒత్తిడిని పట్టించుకోను : Rohit Sharma

by Vinod kumar |   ( Updated:2023-08-28 15:08:32.0  )
బయట నుంచి వచ్చే ఒత్తిడిని పట్టించుకోను : Rohit Sharma
X

న్యూఢిల్లీ : వరల్డ్ కప్ సమయంలో బయట నుంచి వచ్చే ఒత్తిడిని తాను పట్టించుకోనని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పలు విషయాలు వెల్లడించాడు. ప్రపంచకప్‌కు ముందు తాను ఎంత రిలాక్స్ ఉన్నాదనేదే ముఖ్యమని, అందుకే బయట నుంచి వచ్చే ఏ రకమైన ఒత్తిడినైనా సరే తాను పట్టించుకోనని చెప్పాడు. 2019 ప్రపంచకప్‌కు ముందు తాను ఏ దశలో ఉన్నాననో ఇప్పుడు అదే దశలోకి రావడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. 2019 వరల్డ్ కప్‌లో రోహిత్ 648 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది జరగబోయే ప్రపంచకప్‌లోనూ రోహిత్ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు.

‘నేను టోర్నీకి సిద్ధమయ్యా. మంచి ఫిట్‌నెస్‌తోపాటు మానసికంగా గొప్ప స్థితిలో ఉన్నా. 2019 ప్రపంచకప్ ముందు నేను ఓ క్రికెటర్‌గా, ఓ వ్యక్తిగా ఎలా ఉన్నానో తిరిగి పొందాలనుకుంటున్నా. అలా చేయడానికి నాకు సమయం కూడా ఉంది.’ అని రోహిత్ తెలిపాడు. అలాగే, కెప్టెన్‌గా తన వారసత్వం గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వారసత్వాన్ని వదిలివేయాలని ఆలోచించే వ్యక్తిని కాదు. నా వారసత్వం గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. నేను కాదు.’ అని చెప్పాడు.

విజయం లభించినా, ఓటమి ఎదురైనా ఒక వ్యక్తి రాత్రికి రాత్రే మారిపోడని, తాను 16 ఏళ్లు మారలేదని చెప్పాడు. ‘ముందు రెండు నెలల్లో నేనుగానీ, నా జట్టుగానీ ఏం సాధించాలనే దానిపైనే ఫోకస్ పెట్టాం. నేను గణాంకాలను పట్టించుకోను. మన ముందున్న సమయాన్ని ఆస్వాదించడానికే చూస్తా. నాకు సంతోషాన్నిచ్చే విషయాల గురించే ఆలోచిస్తా. ఈ రెండు నెలల్లో నా సహచరులతో అద్భుతమైన క్షణాలను పొందాలనుకుంటున్నా.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

గదిలో కూర్చుని బాధపడ్డా..

2011 ప్రపంచకప్‌కు ఎంపికకాకపోవడంపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. తాను 2011 ప్రపంచకప్‌కు ఎంపికవ్వలేదని, అప్పుడు ఎలా ఉంటుందో తనకు తెలుసనని తెలిపాడు. ‘2011 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంతో నాకు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. గదిలో కూర్చేని బాధపడ్డా. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు యువరాజ్ సింగ్ కాల్ చేసి తన రూంకు రమ్మన్నాడు. డిన్నర్ కోసం బయటికి తీసుకెళ్లాడు. ‘మీ ముందు చాలా సంవత్సరాలు ఉన్నాయి. తిరిగి జట్టులోకి వచ్చేందుకు నువ్వు నీ ఆటపై, నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు సమయం కేటాయించు.’ అని అతను నాతో చెప్పాడు. ఆ తర్వాత నేను కష్టపడ్డా. తిరిగి జట్టులోకి వచ్చా.’ అని వివరించాడు. ప్రస్తుతం జట్టులో చోటు దక్కని ప్లేయర్లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని, ఎందుకు ఎంపిక చేయలేకపోయామో వివరిస్తానని తెలిపాడు. ‘కెప్టెన్‌ వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలపై జట్టు ఎంపిక ఆధారపడి ఉండదు. ఎవరినైనా పక్కనపెడితే దానికో కారణం ఉంటుంది.’ అని రోహిత్ తెలిపాడు.

Advertisement

Next Story