భారత క్రికెట్‌లో అది మామూలే.. టెస్టుల్లో అరంగేట్రంపై రజత్ పాటిదార్ ఆసక్తికర కామెంట్స్

by Harish |
భారత క్రికెట్‌లో అది మామూలే.. టెస్టుల్లో అరంగేట్రంపై రజత్ పాటిదార్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : మహారాష్ట్ర బ్యాటర్ రజత్ పాటిదార్ ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో అరంగేట్రం కోసం అతను 30 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది. శుక్రవారం మ్యాచ్ అనంతరం రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌లో చాలా కాలం ఎదురుచూడటం మామూలేనని చెప్పాడు. ‘భారత క్రికెట్‌లో ఎదురుచూడటం మామూలే. చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. నేను ఏం చేయగలుగుతానో దానిపైనే ఫోకస్ పెడతాను. 30 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం పట్ల మంచి అనుభూతితోనే ఉన్నా. మిడిలార్డర్‌లో ఆడటం నాపై ఎలాంటి ఒత్తిడిని తేలేదు. ఎందుకంటే, దేశవాళీలో నేను చాలా క్రికెట్ ఆడాను. ఎప్పటిలాగే గత రాత్రి బాగా నిద్రపోయాను. నా ఇన్నింగ్స్ బాగుంది. కానీ, భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండేది. యశస్వి జైశ్వాల్ గురించి మాట్లాడాలంటే అతను మంచి ఆటగాడు. బౌలర్లను ఎదుర్కోవడంలో అతనికి ప్రత్యేకమైన శైలి ఉంది.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, రెండో టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రజత్ పాటిదార్ 72 బంతులు ఎదుర్కొని 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి అతను 4 వికెట్‌కు అతను 70 పరుగులు జోడించాడు. అయితే, రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ అతన్ని దురదృష్టం వెంటాడింది. విచిత్రకర రీతిలో అవుటయ్యాడు. రెహాన్ అహ్మద్ వేసిన బౌలింగ్‌లో తొలి బంతిని డిఫెన్స్ ఆడగా.. బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి వెనకాల వికెట్లను తాకింది. దీంతో రజత్ పాటిదార్ నిరాశగా మైదానం వీడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ‘పాపం రజత్ పాటీదార్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో రజత్ పాటిదార్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత ఏ జట్టు తరఫున రజత్ పాటిదార్(151) భారీ సెంచరీతో రాణించాడు. గతేడాది సౌతాఫ్రికాపై అతను వన్డే అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed