అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడేది ఆ జట్టే

by Harish |
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడేది ఆ జట్టే
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టుదో తేలిపోయింది. సెమీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా.. టైటిల్ పోరులో భారత్‌ను ఢీకొట్టనుంది. గురువారం బెనోని వేదికగా చివరి వరకూ ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో పాక్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు పూర్తిగా తేలిపోయింది. 48.5 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. అజాన్ అవైస్(52), అరాఫత్ మిన్హాస్(52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాక్ ఆ స్కోరైనా చేయగలిగింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ హుస్సేన్(17) డబుల్ డిజిట్ స్కోరు చేయగా ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంతితో విజృంభించిన టామ్ స్ట్రాకర్(6/24) పాక్ పతనాన్ని శాసించాడు.

అయితే, 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆసిస్ కష్టపడాల్సి వచ్చింది. పాక్ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తడబడిన కంగారుల జట్టు చివరికి ఆఖరి ఓవర్‌లో లక్ష్యాన్ని పూర్తి చేసింది. 49.1 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 181 పరుగులు చేసింది. ఓపెనర్ హ్యారీ డిక్సన్(50) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఓలివర్ పీక్(49) రాణించాడు. అనంతరం రాఫ్ మాక్‌మిల్లాన్(19 నాటౌట్) కీలక పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో ఆసిస్ విజయానికి 3 పరుగులు అవసరమవ్వగా.. మాక్‌మిల్లాన్ తొలి బంతినే బౌండరీ కొట్టి గెలుపు లాంఛనం చేశాడు. దీంతో టోర్నీ చరిత్రలో ఆసిస్ 6వ సారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed