ODI World Cup 2023 : అభిమానులకు టీమ్ ఇండియా స్పిన్నర్ స్పెషల్ రిక్వెస్ట్..

by Vinod kumar |   ( Updated:2023-08-03 10:56:03.0  )
ODI World Cup 2023 : అభిమానులకు టీమ్ ఇండియా స్పిన్నర్ స్పెషల్ రిక్వెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అభిమానులకు టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. సానుకూల దృక్పథంతో భారత జట్టుకు మద్దతుగా నిలవాలని కోరాడు. అంతేతప్పా అతిగా రియాక్ట్ అవ్వద్దని విజ్ఞప్తి చేశాడు. పదేళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి సొంతగడ్డపై ప్రపంచకప్ జరుగుతుండటంతో భారత జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈక్రమంలోనే భారత అభిమానులు జట్టుకు అండగా నిలవాలని, ఓడినా.. గెలిచినా ఒకేలా ఉండాలని అశ్విన్ రిక్వెస్ట్ చేశాడు.

'భారత్ గెలిస్తే అభినందనలు చెబుదాం. ఒకవేళ ఓడిపోతే మద్దతుగా నిలుద్దాం. సానుకూల దృక్పథంతో జట్టుకు అండగా నిలవాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. వన్డే ప్రపంచకప్‌ను గెలవడం సులువైన వ్యవహారం కాదు. ఏదో ఒక ఆటగాడిని తీసుకుంటేనో.. లేకపోతే మరో ఆటగాడిని పక్కన పెడితేనో విజయం దక్కదు. అందరూ సమష్టిగా రాణిస్తేనే విజేతగా నిలుస్తాం. ఒకవేళ మ్యాచ్‌ ఓడిపోతే అక్కడితో ఆగిపోం. ముందుకు సాగిపోవాలి. అంతేకానీ, అతన్ని జట్టులోకి తీసుకొంటే గెలిచి ఉండేవాళ్లమనే వ్యాఖ్యలు సరికావు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇలా చేస్తే బాగుండేది.. అలా జరిగితే జట్టుకు ప్రయోజనం అనే మాటలు మాట్లాడవద్దు. వచ్చే ప్రపంచకప్‌లోనూ భారత్‌ విజయం సాధించాలని మాత్రమే కోరుకుందాం. ఎందుకంటే గత మెగా టోర్నీల్లో సెమీస్‌ వరకు చేరిన రికార్డు భారత్‌ సొంతం.'' అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో మెగా మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Next Story