యువీ తండ్రి యూటర్న్!.. ధోనీపై ప్రశంసలు కురిపించిన యోగ్‌రాజ్

by Harish |
యువీ తండ్రి యూటర్న్!.. ధోనీపై ప్రశంసలు కురిపించిన యోగ్‌రాజ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ధోనీ ఫియర్‌లెస్ కెప్టెన్ అని కితాబిచ్చాడు. మాజీ క్రికెటర్ అయిన యోగ్‌రాజ్ గతంలో చాలా సందర్భాల్లో ధోనీని విమర్శించాడు. యువీ కెరీర్ త్వరగా ముగిసిపోవడానికి ధోనీనే కారణమని, తన కొడుకు జీవితాన్ని నాశనం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్.. ధోనీని ప్రశంసించడం గమనార్హం. మైదానంలో ధోనీ తెలివితేటలను కొనియాడాడు. ‘ఆటగాళ్లు ఏం చేయాలో ధోనీ చెబుతాడు. అందుకే, అతను మోటివేటింగ్ కెప్టెన్ అని భావిస్తున్నా. అతనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు ఏ విధంగా బౌలింగ్ చేయాలో అతనికి తెలుసు. ఎక్కడ బంతి వేయాలో, ఎలా వేయాలో బౌలర్లకు సలహాలు ఇస్తాడు.’అని చెప్పాడు. అలాగే, ధోనీలో నిర్భయత్వం అతనిలో నచ్చే మరో అంశమని తెలిపాడు. ‘ఆస్ట్రేలియాలో ధోనీ బ్యాటింగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మిచెల్ జాన్సన్ వేసిన బౌన్సర్ ధోనీ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఆ తర్వాతి బంతినే అతను సిక్సర కొట్టాడు. ధోనీలాంటి బ్యాటర్లు కొందరే ఉంటారు.’ అని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చాడు.


Next Story