అమ్మా.. ఇంటికొచ్చే దారి మర్చిపోయావా?.. తన పిల్లలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన మోనా అగర్వాల్

by Harish |
అమ్మా.. ఇంటికొచ్చే దారి మర్చిపోయావా?.. తన పిల్లలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన మోనా అగర్వాల్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మోనా తొలి పారా విశ్వక్రీడల్లోనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఫైనల్ అనంతరం మోనా తాను చేసిన త్యాగాలను, ఎదుర్కొన్న సవాళ్లను, కష్టాలను వివరించింది. షూటింగ్ శిక్షణ కోసం తన పిల్లలను ఇంటివద్దనే వదిలి వచ్చానని, ప్రతి రోజూ వారిని తలుచుకుంటూ ఏడ్చేదాన్ని అని గుర్తు చేసుకుంది. ‘ప్రతి రోజు పిల్లలకు కాల్ చేసేదాన్ని. అప్పుడు వారు ఒక్కటే చెప్పేవారు. ‘అమ్మా.. నువ్వు ఇంటికి తిరిగొచ్చే దారిని మర్చిపోయావు, జీపీఎస్‌ పెట్టుకుని తిరిగా.’ అని అనేవారు. ప్రతి రోజూ సాయంత్రం వారితో మాట్లాడుతున్నపుడు ఏడ్చేదాన్ని.’ అని ఎమోషనల్ అయ్యింది.

తాను ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డాడనని మోనా చెప్పింది. అలాగే, ఆరంభంలో తాను కుటుంబసభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారి నుంచి అభ్యంతరాలు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకుంది. ‘2010లో నా కలను నెరవేర్చుకోవడానికి ఇంటి నుంచి బయటకొచ్చినప్పుడు చాలా మంది అభ్యంతరాలు చెప్పారు. చాలా ఆంక్షలు పెట్టారు. కానీ, ఆ రోజు వాళ్లందరూ నాతో ఉన్నారు. అందుకు గర్వంగా ఉంది.’ అని తెలిపింది. కష్టాలు, అడ్డంకులను దాటుకుని పతకం సాధించడం గొప్ప అనుభూతినిస్తుందని చెప్పింది. రెండున్నరేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించానని, ఈ వ్యవధిలోనే తన లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల మోనా సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed