క్రీడాపురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి

by Shamantha N |   ( Updated:2024-01-09 15:15:53.0  )
క్రీడాపురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అర్జున అవార్డు అందుకున్నాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగానే దేశంలోనే రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డును షమీ రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నాడు. గతేడాది జరిగిన ప్రపంచ కప్‌లో 7మ్యాచుల్లోనే 24 వికెట్లు తీసిన షమీ.. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ సిఫార్సు మేరకు కేంద్రం షమీకి అర్జున అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. ‘ఇది నా జీవితంలో సాధించిన అతిపెద్ద విజయం. ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపాడు. 2023కుగానూ గతేడాది డిసెంబర్ 20న కేంద్రం క్రీడా పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా క్రీడా అవార్డుల ప్రదానోత్సవం హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహిస్తారు. అయితే, గతేడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వరకు హాంగ్‌జౌ వేదికగా ఆసియా క్రీడలు జరిగిన నేపథ్యంలో తాజాగా నిర్వహించారు. ఇక, క్రీడల్లో దేశ అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్ రత్న’ అవార్డుకు గతేడాది బ్యాడ్మింటన్‌లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్‌‌‌తోపాటు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి జోడీ మలేషియాలో ఓపెన్ సూపర్ 100 టోర్నీ ఆడుతోంది. దీంతో ఈ వేడుకకు హాజరుకాలేకపోయింది. ఇక, అర్జున అవార్డుకు వివిధ క్రీడల నుంచి మొత్తం 26 మంది ఆటగాళ్లు ఎంపికవ్వగా, క్రికెట్ నుంచి షమీ మాత్రమే ఉండటం గమనార్హం. సాత్విక్-చిరాగ్ జోడీ దక్కించుకున్న ఖేల్‌రత్న సహా తెలుగు రాష్ట్రాలకు నాలుగు అవార్డులు దక్కాయి. బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్, షూటర్ ఇషా సింగ్, అంధుల క్రికెట్‌లో భారత్‌కు వరల్డ్ కప్ అందించిన అజయ్ రెడ్డి అర్జున అవార్డులు అందుకున్నారు.

అర్జున అవార్డు గ్రహీతలు

ఓజస్ ప్రవీణ్(ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి(ఆర్చరీ) శ్రీశంకర్(అథ్లెటిక్స్), పరుల్ చౌదరి(అథ్లెటిక్స్), మహ్మద్ హుసాముద్దీన్(బాక్సింగ్)ఆర్ వైశాలి(చెస్)మహ్మద్ షమీ(క్రికెట్), అనుష్ అగర్వాలా(గుర్రపు స్వారీ), దివ్యకృతి సింగ్(ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్), దీక్షా దాగర్(గోల్ఫ్), కృష్ణ బహదూర్ పాఠక్(హాకీ), సుశీల చాను(హాకీ), పవన్ కుమార్(కబడ్డీ), రీతు నేగి(కబడ్డీ), నస్రీన్(ఖో-ఖో), పింకీ(లాన్ బౌల్స్), ప్రతాప్ సింగ్ తోమర్(షూటింగ్), ఈషా సింగ్(షూటింగ్), హరీందర్ పాల్(స్క్వాష్), అహికా ముఖర్జీ(టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్(రెజ్లింగ్), అంతిమ్(రెజ్లింగ్), రోషిబినా దేవి(వుషు), శీతల్ దేవి(పారా ఆర్చరీ), అజయ్ కుమార్ రెడ్డి(బ్లైండ్ క్రికెట్), ప్రాచీ యాదవ్(పారా కానోయింగ్)

ద్రోణాచార్య పురస్కారం

ఖేల్ రత్న, అర్జున అవార్డులతోపాటు ఆటగాళ్లను తీర్చిదిద్దిన ఉత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య పురస్కారాలనూ కేంద్రం ప్రకటించింది. రెగ్యులర్ కేటగిరీలో అవార్డులు పొందినవారిలో లలిత్ కుమార్(రెజ్లింగ్), ఆర్బీ రమేష్(చెస్), మహావీర్ ప్రసాద్ సైనీ(పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్(హాకీ), గణేష్ ప్రభాకర్(మల్లఖాంబ్) ఉన్నారు.

లైఫ్‌టైమ్ కేటగిరీ: జస్కిరత్ సింగ్(గోల్ఫ్), భాస్కరణ్(కబడ్డీ), జయంత కుమార్(టేబుల్ టెన్నిస్)

జీవితకాల సాఫల్య పురస్కారం: మంజుష కన్వార్(బ్యాడ్మింటన్), వినీత్ కుమార్ (హాకీ), కవిత సెల్వరాజ్(కబడ్డీ)

Read More..

అర్జున అవార్డు అందుకున్న హుస్సముద్దీన్..

Advertisement

Next Story