స్టార్ క్రికెటర్లకు గాయాల బెడద

by John Kora |
స్టార్ క్రికెటర్లకు గాయాల బెడద
X

- చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ప్లేయర్లు

- ఆయా జట్లకు పెద్ద మైనస్

దిశ, స్పోర్ట్స్: మరో వారం రోజుల్లో పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ మెగా ఈవెంట్‌లో అన్ని దేశాల జట్లు పాల్గొంటున్నాయి. పాకిస్తాన్‌లో చివరి సారిగా 1996లో ఐసీసీ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ సారి చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న పలు దేశాల క్రికెట్ జట్లు తమ స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల పలువురు చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. ఇంతకు ఏయే దేశంలో ఏ ఆటగాళ్లు మిస్ అయ్యారో ఒక సారి చూద్దాం.

ఆప్గానిస్తాన్ : మిస్టరీ స్పిన్న్ర్ ఎఎం ఘజాన్ఫర్ వెన్నునొప్పి గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు.

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో కీలకమైన ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, జోష్ హాజెల్‌వుడ్ లను గాయాల కారణంగా ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాల వల్ల మిచెల్ స్టార్క్ జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా మిచెల్ మార్ష్ ఈ సీజన్‌లో ఆడటం లేదు. ఇక చాంపియన్ ట్రోఫీ ప్రొవిజినల్స్‌లో ఎంపిక చేసిన తర్వాత మార్కస్ స్టోయినిష్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

ఇంగ్లాండ్ : ఇండియాతో జరుగుతున్న వైట్ బాల్ సిరీస్‌లో జాకబ్ బెథెల్ గాయపడ్డాడు. దీంతో అతను మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు.

ఇండియా : బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో గాయపడిన జస్ప్రిత్ బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో బీసీసీఐ అతడిని ఎంపిక చేయలేదు.

న్యూజీలాండ్ : కివీస్ జట్టు కీలకమైన ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. లాకీ ఫెర్గూసస్ ఇటీవల ఐఎల్‌టీ20లో గాయపడ్డాడు. అప్పటి నుంచి ఇంకా కోలుకోలేదు. ఇక పాకిస్తాన్‌లోనే ఉన్న రచిన్ రవీంద్ర ట్రైనేషన్ సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ప్రస్తుతం అతను చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండేది లేనిది ఇంకా తెలియరాలేదు.

పాకిస్తాన్ : సొంత గడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్‌కు స్టార్ బౌలర్ హారీస్ రవూఫ్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ట్రై నేషన్ సిరీస్‌లో గాయపడిన రవూఫ్ ఇంకా కోలుకోలేదు. చాంపియన్స్ ట్రోఫీలోగా కోలుకుంటాడని జట్టు ఆశలు పెట్టుకుంది.

దక్షిణాఫ్రికా : వెన్నునొప్పి కారణంగా రెండు నెలలుగా క్రికెట్‌కు దూరమైన అన్రిక్ నోకియా ఇంకా కోలుకోలేదు. అతని స్థానంలో ఎంపిక చేసిన గెరాల్డ్ కోయిట్జీ కూడా ఇప్పుడు గాయంతో సతమతమవుతున్నాడు.

Next Story