అదరగొడుతున్న యువ షూటర్లు.. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు

by Harish |
అదరగొడుతున్న యువ షూటర్లు.. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : పెరూలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షూటర్ల జోరు కొనసాగుతోంది. సోమవారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. రైఫిల్, పిస్టల్ మిక్స్‌డ్ జట్లు కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గౌతమి బానోత్, అజయ్ మాలిక్‌ ద్వయం బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత జోడీ 628.9 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కాంస్య పోరులో గౌతమి, అజయ్ జంట 17-9 తేడాతో క్రొయేషియాకు చెందిన అనమరిజా టర్క్-డార్కో టొమాసెవిక్ జోడీని ఓడించి పతకం గెలుచుకుంది. చైనా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం సాధించాయి.

మరోవైపు, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో లక్షిత, ప్రమోద్ జోడీ కూడా బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత జంటలు లక్షిత-ప్రమోద్(575 స్కోరు), కనిష్క-ముకేశ్(573 స్కోరు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్యం కోసం పోటీపడ్డాయి. కాంస్య పోరులో లక్షిత-ప్రమోద్ జోడీ 16-8 తేడాతో కనిష్క-ముకేశ్ జోడీపై నెగ్గింది. అలాగే, పురుషుల, మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత జట్లు ఐదో స్థానంతో సరిపెట్టాయి. టోర్నీలో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ప్రస్తుతం భారత్ 5 పతకాలతో అగ్రస్థానంలో ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed