ఐదో టెస్టు కూడా రాహుల్ దూరం.. తిరిగొచ్చిన బుమ్రా

by Harish |
ఐదో టెస్టు కూడా రాహుల్ దూరం.. తిరిగొచ్చిన బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో టీమ్ ఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ధర్మశాల వేదికగా చివరి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు సెలెక్టర్లు గురువారం భారత జట్టును ప్రకటించారు. వరుసగా మూడు టెస్టులకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ఐదో టెస్టుకు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతను చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడని బీసీసీఐ తెలిపింది. రాహుల్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రాహుల్ స్పెషలిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ టెస్టులో తొడకండరాల గాయం బారిన పడిన రాహుల్ ఆ తర్వాత వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ టెస్టులకు దూరమయ్యాడు.

మరోవైపు, చివరి టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐదో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సెలెక్టర్లు రాంచీ టెస్టుకు అతనికి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టులో సిరీస్ గెలిస్తే చివరి టెస్టుకు కూడా అతనికి రెస్ట్ ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ధర్మశాల టెస్టు జట్టులో అతను కూడా ఉన్నాడు. బుమ్రా రాకతో వాషింగ్టన్ సుందర్‌ను సెలెక్టర్లు జట్టు నుంచి రిలీజ్ చేశారు. రంజీ ట్రోఫీలో ముంబైతో సెమీస్ కోసం అతను తమిళనాడు జట్టులో చేరనున్నాడు. ఐదో టెస్టులో జట్టుకు అతని అవసరముంటే తిరిగి వస్తాడని బోర్డు తెలిపింది.

స్టార్ పేసర్ మహ్మద్ షమీకి ఇటీవల లండన్‌లో సర్జరీ అయిన విషయం తెలిసిందే. తాజాగా బోర్డు షమీ హెల్త్ అప్‌డేట్ ఇచ్చింది. ‘షమీ తన కుడి మడమ సమస్యకు ఫిబ్రవరి 26న చేయించుకున్న సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం అతను బాగా కోలుకుంటున్నాడు. త్వరలోనే అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ‌లో చేరనున్నాడు.’ అని తెలిపింది.

భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.

Advertisement

Next Story

Most Viewed