రోహిత్, కోహ్లీపై జై షా కీలక వ్యాఖ్యలు.. వాళ్లను ఆ విధంగా చూడలేమంటూ కామెంట్స్

by Harish |
రోహిత్, కోహ్లీపై జై షా కీలక వ్యాఖ్యలు.. వాళ్లను ఆ విధంగా చూడలేమంటూ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో ప్రారంభమయ్యే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో దాదాపు భారత స్టార్ క్రికెటర్లందరూ పాల్గొంటున్నారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు మాత్రం బీసీసీఐ మినహాయింపు ఇచ్చింది. వారికి మినహాయింపు ఇవ్వడానికి గల కారణాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా వెల్లడించారు. దేశవాళీలో గాయపడే అవకాశం ఉన్నందు వల్లే వారిని ఆడమని ఒత్తిడి తేలేమని చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జై షా పలు విషయాలు వెల్లడించారు. ‘దేశవాళీ ఆడాలనే విషయంలో మేము కొంచెం కఠినంగా ఉన్నాం. గాయపడిన వారు దేశవాళీలో నిరూపించుకున్నాకే జాతీయ జట్టులోకి వస్తారు. కానీ, దేశవాళీ క్రికెట్ ఆడాలని రోహిత్, విరాట్‌ను ఆడగడం సరైంది కాదు. వారు గాయపడే ప్రమాదం ఉంది. ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లు ఉన్నాయి. టాప్ ఆటగాళ్లెవరూ దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. మన ఆటగాళ్లను గౌరవంగా చూడాలి తప్ప సేవకుల్లాగా కాదు. రోహిత్, విరాట్ తప్ప అందరూ దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు.’ అని తెలిపారు.

ఐసీసీ అడిగింది.. కానీ నో చెప్పా

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్‌పై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఐసీసీ టోర్నీ నిర్వహణకు మిగతా దారులను పరిశీలిస్తోంది. అందులో భాగంగా టోర్నీని భారత్‌లో నిర్వహించాలని ఐసీసీ అడగ్గా.. అందుకు బీసీసీఐ తిరస్కరించినట్టు జై షా తెలిపారు. ‘అప్పటికీ మనకు వర్షకాలమే. అలాగే, వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్నాం. వరుస వరల్డ్ కప్‌లకు నిర్వహించడంపై చాలా కష్టం.’ అని వెల్లడించారు.

వేర్వేరు కోచ్‌లు ఉంటే ఆటగాళ్లతో బంధం ఎలా?

వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు ఉండాలన్న ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ..‘భారత టెస్టు, వన్డే, టీ20 జట్లలో దాదాపుగా 70 శాతం కాస్త అటు ఇటుగా ఆ ఆటగాళ్లే ఉంటారు. కాబట్టి, ప్లేయర్లకు వేర్వేరు కోచ్‌లతో బంధం ఎలా ఏర్పడుతుంది?.’ అని చెప్పారు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్‌పై ఇటీవల ఫ్రాంచైజీలతో సుదీర్ఘంగా చర్చించామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐపీఎల్ ముగింపు, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మధ్య 15 రోజులపాటు సమయం ఉంచుతామని చెప్పారు. భారత్‌లో ఎక్కువగా పింక్ బాల్ టెస్టులు నిర్వహించకపోవడానికి గల కారణాన్ని జై షా వివరించారు. ‘పింక్ బాల్ టెస్టులు నిర్వహించకూడదన్న నిబంధనలు ఏం లేవు. కానీ, భారత్‌లో ఆ టెస్టులు కేవలం రెండు రోజుల్లోనే ముగుస్తాయి. దీనివల్ల ప్రేక్షకులు, బ్రాడ్‌కాస్టర్స్ డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఐదు రోజుల కోసం టికెట్ కొంటే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోతే అభిమానులు నిరాశకు గురవుతారు. మిగతా రోజులకు రిఫండ్ కూడా ఉండదు.’ అని చెప్పారు.

Advertisement

Next Story