రోహిత్‌ను పక్కనపెట్టడంపై పాండ్యా రియాక్షన్ ఇదే.. అతనితో ఏం ఇబ్బంది ఉండదంటూనే!

by Harish |
రోహిత్‌ను పక్కనపెట్టడంపై పాండ్యా రియాక్షన్ ఇదే.. అతనితో ఏం ఇబ్బంది ఉండదంటూనే!
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్‌ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో బరిలోకి దిగబోతున్నది. ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టిన ముంబై ఫ్రాంచైజీ.. పాండ్యాకు పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా రోహిత్‌తో సత్సంబంధాలు, కెప్టెన్సీ మార్పుపై పాండ్యా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సోమవారం ముంబై ఇండియన్స్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాండ్యా మాట్లాడుతూ.. రోహిత్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. ‘టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ నాకు సహాయం చేస్తాడు. అతని సారథ్యంలో ముంబై జట్టు ఏదైదో సాధించిందో దాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. కెరీర్ మొత్తం అతని సారథ్యంలోనే ఆడాను. అతను నాకు అండగా ఉంటాడని నాకు తెలుసు.’ అని తెలిపాడు.

కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్‌తో మాట్లాడారా? అనే ప్రశ్నకు పాండ్యా స్పందిస్తూ.. రోహిత్ పర్యటనలో ఉండటంతో ఎక్కువ మాట్లాడే అవకాశం రాలేదని, రోహిత్ జట్టుతో కలిసిన తర్వాత అతన్ని కలుస్తాననని చెప్పాడు. అలాగే, కెప్టెన్సీ మార్పుతో అభిమానులు ఎమోషనల్ అవడంపై పాండ్యా మాట్లాడుతూ..‘నా నియంత్రణలో ఉన్నవాటిని మాత్రమే నియంత్రంచగలను. ఫ్యాన్స్ భావోద్వేగాలను నేను గౌరవిస్తా. కానీ, కెప్టెన్‌గా నేను ఏం చేయగలను అనే దానిపై దృష్టి పెడతాను.’ అని బదులిచ్చాడు. అలాగే, ఈ సీజన్‌లో తాను బౌలింగ్ చేస్తానని పాండ్యా తెలిపాడు.

కాగా, ముంబైతోనే ఐపీఎల్‌ కెరీర్‌ను మొదలుపెట్టిన పాండ్యా 2015 నుంచి 2021 వరకు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ముంబై అతన్ని రిటైన్ చేసుకోలేదు. అదే సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ 2022లో చాంపియన్‌గా నిలువగా..గతేడాది కూడా ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఈ సీజన్ వేలానికి ముందు అతను తిరిగి ముంబై గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. ట్రేడింగ్ విండో ద్వారా పాండ్యాను కొనుగోలు చేసిన ముంబై.. రోహిత్‌ను తప్పించి అతనికి పగ్గాలు అప్పగించింది. ఈ సీజన్‌లో ఈ నెల 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Next Story