పారిస్ ఒలింపిక్స్‌కు షూటర్ల బృందం ఎంపిక.. తెలంగాణ అమ్మాయి ఈషా సింగ్‌ కూడా

by Harish |
పారిస్ ఒలింపిక్స్‌కు షూటర్ల బృందం ఎంపిక.. తెలంగాణ అమ్మాయి ఈషా సింగ్‌ కూడా
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షూటర్, తెలంగాణకు చెందిన ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననుంది. పారిస్ విశ్వక్రీడల్లో రైఫిల్, పిస్టోల్ ఈవెంట్లలో పాల్గొనే షూటర్లను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) మంగళవారం ఎంపిక చేసింది. 15 మందితో బృందాన్ని ప్రకటించగా.. అందులో ఈషా సింగ్ పేరు కూడా ఉంది. ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి. మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత ఈవెంట్‌లో ఈషా సింగ్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొంతకాలంగా అంతర్జాతీయ వేదికగా సత్తాచాటుతున్న ఈషా సింగ్ గతేడాది ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించింది. అందులో 25 మీటర్ల పిస్టోల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణంతోసహా వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం కూడా గెలుచుకుంది. మరో స్టార్ షూటర్ మను భాకర్‌‌కు ఒలింపిక్స్‌లో మూడు ఈవెంట్లలో బెర్త్ దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్, 25 మీటర్ల పిస్టోల్ కేటగిరీలతోపాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ పోటీపడనుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే. మను భాకర్‌‌తోపాటు ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అంజుమ్ మౌద్గిల్, ఎలవెనిల్ వలరివన్‌లు రెండో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగబోతున్నారు. 11 మందికి ఇవే తొలి విశ్వక్రీడలు.

Advertisement

Next Story

Most Viewed