బంతి మెరుగవ్వాలె

by Harish |
బంతి మెరుగవ్వాలె
X

న్యూఢిల్లీ : సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయం ఈ సారి కూడా అందని ద్రాక్షే అని తొలి టెస్టుతోనే తేలిపోయింది. టీమ్ ఇండియా ఘోర వైఫల్యంతో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సెంచూరియన్ పిచ్‌పై భారత ఆటగాళ్లు బంతితో, బ్యాటుతో విఫలమై.. మూడో రోజుల్లోనే మ్యాచ్‌ను సఫారీల చేతిలో పెట్టేశారు. తొలి టెస్టు ఓటమితో సిరీస్ విజయం నిరీక్షణ ఎలాగూ తప్పదు. కనీసం సిరీస్ ఓటమినైనా అడ్డుకోవడం ఇప్పుడు భారత్ ముందున్న కర్తవ్యం. తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి ప్రధాన కారణాల్లో బౌలింగ్ వైఫల్యం కూడా ఉంది. సెంచూరియన్ పిచ్‌పై సౌతాఫ్రికా బౌలర్లు వికెట్లతో చెలరేగుతుంటే.. భారత బౌలర్లు మాత్రం వికెట్లు తీయడానికి తంటాలు పడ్డారు. మూడో రోజుల్లో పడిన 30 వికెట్లలో 20 వికెట్లు ఆతిథ్య జట్టు బౌలర్లు తీసినవే.. భారత బౌలర్లు 10 వికెట్లు మాత్రమే పడగొట్టారంటే సెంచూరియన్ పిచ్‌‌పై ఏ విధంగా తేలిపోయారో అర్థమవుతుంది. కాబట్టి, రెండో టెస్టులో టీమ్ ఇండియా బౌలింగ్ పరంగా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా సౌతాఫ్రికా పిచ్‌లు పేస్‌తోపాటు బౌన్స్‌ను కలిగి ఉంటాయి. సెంచూరియన్ పిచ్ అలాగే స్పందించగా.. రెండో టెస్టు జరిగే కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్ పిచ్‌ కూడా అలాగే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం బౌలింగ్ కూర్పుపై టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తున్నది.

బుమ్రా, అశ్విన్ మినహా..

తొలి టెస్టులో భారత బౌలింగ్ దళంలో బుమ్రా, అశ్విన్ మినహా మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. చాలా రోజుల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన బుమ్రా మరోసారి జట్టులో తన పాత్రేంటో నిరూపించుకున్నాడు. పరుగులను కట్టడి చేస్తూనే మరోవైపు వికెట్లు తీసుకున్నాడు. 26.4 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఒక్క వికెట్ మాత్రమే తీసినప్పటికీ 19 ఓవర్లు వేసిన అతను 2.20 ఎకానమీతో 41 పరుగులే ఇచ్చాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. కానీ, ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. 24 ఓవర్లు వేసిన సిరాజ్ 91 పరుగులు ఇచ్చాడు. ఇక, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ పూర్తిగా తేలిపోయారు. బ్యాటుతో నిరాశపర్చిన శార్దూల్.. బంతితోనూ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 19 ఓవర్లలో 5.30 ఎకానమీతో అత్యధిక 101 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ తనపై పెట్టుకున్న అంచనాలు అందుకోలేకపోయాడు. 20 ఓవర్లు వేసిన అతను 93 పరుగులు ఇచ్చాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే, అతను ఫిట్‌నెస్ నిరూపంచుకోవడంలో విఫలమై ఈ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

శార్డూల్‌ డౌట్!.. ముకేశ్, ప్రసిద్ధ్‌లలో ఒక్కరే

బౌలింగ్ కూర్పుపై ఫోకస్ పెట్టిన కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ ద్రవిడ్ రెండో టెస్టు కోసం మార్పులు చేసే అవకాశం ఉంది. న్యూల్యాండ్స్ పిచ్‌ పేసర్లకు అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. స్పిన్నర్లు కూడా సత్తాచాటేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన గత మ్యాచ్‌లో విఫలమైన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు రెండో టెస్టులో పక్కనపెట్టే అవకాశం ఉంది. నెట్స్‌లో శార్దూల్‌ భుజానికి కూడా గాయమైంది. ఈ నేపథ్యంలో అతను రెండో టెస్టు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ జడేజా ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. బంతితోపాటు బ్యాటుతోనూ సత్తాచాటే జడేజా తుది జట్టులోకి వస్తే జట్టు బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది. పేస్ దళంలో బుమ్రా, సిరాజ్ స్థానాలు పదిలమే. మరో స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్ పోటీపడుతున్నారు. గత మ్యాచ్‌లో ఎత్తుగా ఉన్న ప్రసిద్ధ్ బౌన్స్‌తో సఫారీలను బెంబేలెత్తిస్తాడనుకుంటే.. అతను తేలిపోయాడు. అయితే, అతని సామర్థ్యం, నైపుణ్యాలపై మేనేజ్‌మెంట్ నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ముకేశ్ కుమార్ ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. వెస్టిండీస్‌తో ఆడిన ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు తీసుకున్నాడు. అలాగే, దేశవాళీ క్రికెట్‌లో అతనికి మంచి రికార్డే ఉంది. బంతిని స్వింగ్ చేయడంలో అతను దిట్ట. ఇదే విషయాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చెప్పాడు. కేప్‌టౌన్ పిచ్‌కు బంతిని స్వింగ్ చేసే ముకేశ్ చక్కగా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్‌లలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి.

Advertisement

Next Story