మిగతా టెస్టులకూ కోహ్లీ దూరం!

by Swamyn |   ( Updated:2024-02-07 18:56:31.0  )
మిగతా టెస్టులకూ కోహ్లీ దూరం!
X

దిశ, స్పోర్ట్స్: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. మిగతా మ్యాచ్‌లకూ దూరం కానున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే మూడు, నాలుగో టెస్టులకూ కోహ్లీ అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్‌తో భారత జట్టు సొంతగడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తవగా, ఇరు జట్లూ చెరోదాంట్లో గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. దీంతో రానున్న మ్యాచ్‌లు రెండు టీమ్‌లకూ కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలోనే మూడో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులో ఉంటాడని, సిరీస్ ఆరంభంలో బీసీసీఐ వెల్లడించింది. కానీ, అది సాధ్యం కాకపోవచ్చని, మూడు, నాలుగేకాకుండా ఐదో టెస్టుకూ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. విరాట్ భార్య అనుష్క మరో బిడ్డకు జన్మనివ్వనుందని, ఈ సమయాన్ని కోహ్లీ కుటుంబంతోనే గడపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక, మూడు, నాలుగో టెస్టుకు బుధవారమే జట్టును ప్రకటిస్తారని అందరూ భావించారు. చివరి నిమిషం వరకూ అభిమానులు ఎదురుచూసినా బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. జట్టును గురువారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇక, రానున్న ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా మిగతా టెస్టులకు బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావించినట్టు తెలిసింది. కానీ, తాజా సమాచారం ప్రకారం, మూడో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story