క్వార్టర్స్‌కు ప్రణయ్, సాత్విక్ జోడీ

by Harish |
క్వార్టర్స్‌కు ప్రణయ్, సాత్విక్ జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రణయ్ 20-22, 21-14, 21-14 తేడాతో సహచరుడు, యువ షట్లర్ ప్రియాన్ష్ రజావత్‌పై విజయం సాధించాడు. ప్రియాన్ష్‌పై నెగ్గడానికి ప్రణయ్ కాస్త శ్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి గేమ్‌ను ప్రియాన్ష్ గెలుచుకున్నాడు. గత మ్యాచ్‌లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు షాకిచ్చిన ప్రియాన్ష్ ఈ మ్యాచ్‌లోనూ ప్రణయ్‌ను టెన్షన్ పెట్టాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌ను ఆఖర్లో వరుసగా రెండు పాయింట్లు గెలుచుకుని గేమ్‌ను సాధించాడు. అనంతరం బలంగా పుంజుకున్న ప్రణయ్ మిగతా రెండు గేమ్‌ల్లో దూకుడుగా ఆడాడు. పూర్తి ఆధిపత్యంతో వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జు వెయ్‌తో ప్రణయ్ తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-14, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లు చింగ్ యావో-వాంగ్ పో హాన్‌పై గెలుపొందింది. క్వార్టర్స్‌లో డెన్మార్క్‌ జోడీ కిమ్ అస్ట్రప్-అండర్స్ స్కారప్ రాస్ముస్సెన్‌తో సాత్విక్ జోడీ ఆడనుంది.

Advertisement

Next Story