వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ పతకాల పంట..

by Vinod kumar |
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ పతకాల పంట..
X

చెంగ్డు : చైనాలో జరిగిన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఎఫ్‌ఐఎస్‌యూ) వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌‌ మంగళవారం ముగిశాయి. ఈ టోర్నీలో భారత్ పతకాల పంట పండించింది. రికార్డు స్థాయిలో 26 పతకాలు సాధించింది. అందులో 11 స్వర్ణాలు ఉండటం విశేషం. ఐదు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇంతకుముందు 2015 ఎడిషన్‌లో భారత్ ఐదు పతకాలు గెలిచింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా ఉండగా.. ప్రస్తుత ఎడిషన్‌లో ఏకంగా 26 పతకాలు ఖాతాలో వేసుకుంది. షూటింగ్ ఈవెంట్‌లోనే భారత షూటర్లు 14 పతకాలు గెలుచుకున్నారు.

షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ నాలుగు పతకాలతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత ఈవెంట్లతోపాటు10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం కైవసం చేసుకున్నాడు. అలాగే, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో మను భాకర్.. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో సిఫ్ట్ కౌర్ బంగారు పతకాలు అందించారు.

ఆర్చరీ ఈవెంట్‌లో 7 పతకాలు దక్కాయి. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో సంగమ్‌ప్రీత్ సింగ్ బిస్లా, మహిళల వ్యక్తిగత ఈవెంట్‌లో అవ్‌నీత్ కౌర్ విజేతగా నిలిచారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో అమన్ సైనీ, ప్రగతి ద్వయం గోల్డ్ సాధించింది. అథ్లెటిక్స్‌లో నాలుగు మెడల్స్ చేరాయి. తెలుగమ్మాయి యర్రాజి జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు కాంస్యం సాధించింది.

అలాగే, పురుషుల 200 మీటర్ల రేసులో అమ్లాన్ బోర్గోహైన్, మహిళల లాంగ్‌జంప్‌లో భవాని యాదవ్, మహిళల 20 కి.మీ రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో జూడో ఈవెంట్‌లో భారత్ తొలి మెడల్ గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో మహిళల 57 కేజీల కేటగిరీలో యామిని మౌర్య కాంస్య పతకం దక్కించుకుంది. మొత్తంగా టోర్నీలో భారత్ 26 పతకాలతో 7 స్థానంలో నిలిచింది. చైనా(178), జపాన్(93), సౌత్ కొరియా(58) తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి.

Advertisement

Next Story

Most Viewed