హైదరాబాద్ టెస్టుకు ముందు భారత ఆటగాళ్లకు కోచింగ్ క్యాంప్

by Harish |
హైదరాబాద్ టెస్టుకు ముందు భారత ఆటగాళ్లకు కోచింగ్ క్యాంప్
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెలాఖరులో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో టీమ్ ఇండియా ఐదు టెస్టుల సిరీస్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే బీసీసీఐ తొలి రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించింది. ఈ నెల 25న తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టు కోసం హైదరాబాద్‌కు వెళ్లే ముందు భారత ఆటగాళ్లు షార్ట్ కోచింగ్ క్యాంప్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా ఈ కోచింగ్ క్యాంప్‌ను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. క్యాంప్‌లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గడంతో సిరీస్ భారత్ సొంతమైంది. బుధవారం బెంగళూరు వేదికగా నామమాత్రపు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మంగళవారం భారత ఆటగాళ్లు బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఐదు రోజుల క్యాంప్ జరగనుంది. మూడో టీ20 ముగియగానే భారత క్రికెటర్లు కోచింగ్ క్యాంప్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నెల 22న వారు హైదరాబాద్‌కు బయల్దేరుతారని సమాచారం.

వారికి ఫిట్‌నెస్ టెస్టులు

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పలువురు భారత స్టార్ ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్టులకు హాజరుకానున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఈ వారంలో ఫిట్‌నెస్ టెస్టు కోసం ఎన్‌సీఏకు వెళ్లనున్నారు. అలాగే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సైతం టెస్టులు చేయించుకోనున్నారు. మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకుని షమీ ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. అతను వచ్చే వారం ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు. అక్కడ అతన్ని గాయాన్ని అంచనా వేయనున్నారు. మిగతా సిరీస్‌కైనా అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed