తొలి టెస్టును చేజేతులా కోల్పోయిన భారత్.. ఆ స్పిన్నర్ ధాటికి రోహిత్ సేన కుప్పకూలింది

by Harish |
తొలి టెస్టును చేజేతులా కోల్పోయిన భారత్.. ఆ స్పిన్నర్ ధాటికి రోహిత్ సేన కుప్పకూలింది
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించింది. తొలి టెస్టును చేజేతులా కోల్పోయింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో ఆదివారం ఇంగ్లాండ్ చేతిలో 28 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 202 పరుగులకే పరిమితమైంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా..భారత్ 436 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌ను ఓలీ పోప్(196) ఆదుకున్నాడు. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరుతో 316/6తో ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఓలీ పోప్ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. అతని అండతో ఇంగ్లాండ్ 420 పరుగులు చేసింది. దీంతో 231 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఓపెనర్ రోహిత్ చేసిన 39 పరుగులే టాప్ స్కోర్. స్పిన్నర్ టామ్ హార్ట్ల(7/62) టీమ్ ఇండియా పతనాన్ని శాసించగా.. భారత బ్యాటర్లు పెవిలియన్‌ క్యూ కట్టారు. ఆఖర్లో శ్రీకర్ భరత్(28), అశ్విన్(28) 8 వికెట్‌కు 57 పరుగులు జోడించి ఆశలు రేపినా.. ఎంతో సేపు నిలువలేదు. హార్ట్లీ బౌలింగ్‌లోనే సిరాజ్(12) అవుటవడంతో టీమ్ ఇండియా ఆట ముగిసింది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది.

పెవిలియన్‌కు క్యూ..

తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసిన టీమ్ ఇండియాకు 231 లక్ష్యం పెద్దదేం కాదు. రోజున్నర సమయం ఉండటంతో విజయం భారత్‌దే అని అంతా అనుకున్నారు. కానీ, తీరా రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు తేలిపోయిన తీరు దారుణం. అస్సలు పోరాట పటిమ కనబర్చలేదు. టామ్ హార్ట్లీ స్పిన్ మాయలో చిక్కుకున్న భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఛేదనను ఓపెనర్లు రోహిత్ శర్మ(39), యశస్వి జైశ్వాల్(15) బాగానే ఆరంభించారు. తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన జైశ్వాల్ నెమ్మదిగా ఆడగా.. రోహిత్ మాత్రం కాస్త జోరు కనబరిచాడు. అయితే, 12వ ఓవర్‌లో జైశ్వాల్‌ను అవుట్ చేసిన టామ్ హార్ట్లీ భారత్ వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు. అదే ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన గిల్(0)ను కూడా పెవిలియన్ పంపాడు. అంతటితో ఆగని టామ్ హార్ట్లీ.. కాసేపటి తర్వాత రోహిత్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం కేఎల్ రాహుల్(22), అక్షర్ పటేల్(17) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయారు. జడేజా(2), శ్రేయస్ అయ్యర్(13) విఫలమయ్యారు. దాంతో భారత్ 119/7తో తీవ్ర కష్టాల్లో పడింది. అప్పటికీ భారత్ చేయాల్సిన పరుగులు 112. ఈ పరిస్థితుల్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్(28), అశ్విన్(28) విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ జట్టులో ఆశలు రేపింది. అయితే, మరోసారి విజృంభించిన టామ్ హార్ట్లీ వరుస ఓవర్లలో వీరిని అవుట్ చేయడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఆఖర్లో బుమ్రా(6 నాటౌట్)తో కలిసి సిరాజ్(12) పోరాటం చేసినా.. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లోనే సిరాజ్ వికెట్ సమర్పించుకోవడంతో భారత్ ఓటమి పూర్తయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 7 వికెట్లతో టీమ్ ఇండియా పతనాన్ని శాసించగా.. జోరూట్, జాక్ లీచ్‌కు చెరో వికెట్ దక్కింది.

ఓలీ పోప్ తృటిలో డబుల్ సెంచరీ మిస్

అంతకుముందు భారత్ ఎదుట ఇంగ్లాండ్ 231 పరుగుల లక్ష్యం నిర్దేశించిందంటే కారణం ఓలీ పోప్ పోరాటమే. మూడో రోజే అజేయ శతకంతో అతను జట్టుకు ఊపరిపోశాడు. నాలుగో రోజూ కూడా విలువైన పరుగులు జోడించి జట్టును ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 316/6తో ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ 420 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఓలీ పోప్.. రెహాన్ అహ్మద్(28), టామ్ హార్ట్లీ(34)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించడంతో జట్టు స్కోరు 400 దాటింది. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్ అవుటవడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు‌కు మరో 50 పరుగులు జోడించిన ఓలీ పోప్.. 196 పరుగుల వద్ద అవుటై తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లతో రాణించగా.. జడేజా 2, అక్షర్ ఒక వికెట్ తీశారు.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 246 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్ : 436 ఆలౌట్

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 420 ఆలౌట్

జాక్ క్రాలీ(సి)రోహిత్(బి)అశ్విన్ 31, డక్కెట్(బి)బుమ్రా 47, ఓలీ పోప్(బి)బుమ్రా 196, రూట్ ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 2, బెయిర్‌స్టో(బి)జడేజా 10, స్టోక్స్(బి)అశ్విన్ 6, ఫోక్స్(బి)అక్షర్ 34, రెహాన్ అహ్మద్(సి)శ్రీకర్ భరత్(బి)బుమ్రా 28, టామ్ హార్ట్లీ(బి)అశ్విన్ 34, మార్క్‌వుడ్(సి)శ్రీకర్ భరత్(బి)జడేజా 0, జాక్ లీచ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 32.

వికెట్ల పతనం : 45-1, 113-2, 117-3, 140-4, 163-5, 275-6, 339-7, 419-8, 420-9, 420-10

బౌలింగ్ : బుమ్రా(16.1-4-41-4), అశ్విన్(29-4-126-3), అక్షర్(16-2-74-1), జడేజా(34-1-131-2), సిరాజ్(7-1-22-0)

భారత్ రెండో ఇన్నింగ్స్ : 202 ఆలౌట్

రోహిత్ ఎల్బీడబ్ల్యూ(బి)టామ్ హార్ట్లీ 39, యశస్వి జైశ్వాల్(సి)ఓలీ పోప్(బి)టాప్ హార్ట్లీ 15, గిల్(సి)ఓలీ పోప్(బి)టాప్ హార్ట్లీ 0, రాహుల్ ఎల్బీడబ్ల్యూ(బి)రూట్ 22, అక్షర్(సి అండ్ బి)టామ్ హార్ట్లీ 17, శ్రేయస్ అయ్యర్(సి)రూట్(బి)జాక్ లీచ్ 13, జడేజా రనౌట్(స్టోక్స్) 2, శ్రీకర్ భరత్(బి)టామ్ హార్ట్లీ 28, అశ్విన్(స్టంఫ్)ఫోక్స్(బి)టామ్ హార్ట్లీ 28, బుమ్రా 6 నాటౌట్, సిరాజ్(స్టంఫ్)ఫోక్స్(బి)టామ్ హార్ట్లీ 12; ఎక్స్‌ట్రాలు 20.

వికెట్ల పతనం : 42-1, 42-2, 63-3, 95-4, 107-5, 119-6, 119-7, 176-8, 177-9, 202-10

బౌలింగ్ : జోరూట్(19-3-41-1), మార్క్‌వుడ్(8-1-15-0), టామ్ హార్ట్లీ(26.2-5-62-7), జాక్ లీచ్(10-1-33-1), రెహాన్ అహ్మద్(6-0-33-0)

Advertisement

Next Story

Most Viewed