జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ పండుగ

by Swamyn |
జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ పండుగ
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవలే వన్డే వరల్డ్ కప్ ముగిసింది. మరో ఐదు నెలల్లో టీ20 వరల్డ్ కప్ సందడి చేయబోతున్నది. ఈ పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది. జూన్ 1న టోర్నీ మొదలుకానుంది. అదే నెల 29న ఫైనల్ జరగనుంది. ఐసీసీ టోర్నీ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చేసే మ్యాచ్.. భారత్, పాకిస్తాన్ పోరే. ఈ దాయాదుల సమరం జూన్ 9న జరగనుంది.ఇటీవలే వన్డే వరల్డ్ కప్‌లో తలపడిన చిరకాల ప్రత్యర్థులు మరో ఐదు నెలల వ్యవధిలో ఎదురుపడనున్నాయి.

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ శుక్రవారం రిలీజ్ చేసింది. జూన్ 1న టోర్నీ మొదలై.. జూన్ 29న ఫైనల్‌తో ముగియనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో అమెరికా, కెనడా తలపడనున్నాయి. 29 రోజులపాలు జరిగే ఈ పొట్టి ప్రపంచకప్‌లో 20 జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. మొత్తం టోర్నీలో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 16 మ్యాచ్‌లకు అమెరికా, 39 మ్యాచ్‌లకు విండీస్ ఆతిథ్యమిస్తున్నది. అమెరికాలో ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ వేదికలుగా ఎంపికవ్వగా.. కరేబియన్ గడ్డపై బార్బడోస్, ట్రినిడాడ్, గుయానా, అంటిగ్వా, సైట్ లూసియా, సెయింట్ విన్సెంట్ వేదికలపై మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 26, 27 తేదీల్లో జరిగే సెమీస్ మ్యాచ్‌లకు గుయానా, ట్రినిడాద్ ఆతిథ్యమివ్వబోతున్నాయి. జూన్ 29న బార్బడోస్ వేదికగా ఫైనల్ జరగనుంది.

ఫార్మాట్ ఇలా..

గత ఎడిషన్‌తో పోలిస్తే ఈ టోర్నీ ఫార్మాట్ మారిన విషయం తెలిసిందే. గత ఎడిషన్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఉన్న టాప్-8 జట్లు నేరుగా సూపర్-12 రౌండ్ ఆడేవి. తొలి రౌండ్ నుంచి నాలుగు జట్లు సూపర్-12 రౌండ్‌కు చేరుకునేవి. కానీ, ఈ ఎడిషన్‌లో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తొలి రౌండ్ ఆడతాయి. 20 జట్లను ఐదు జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు అంటే మొత్తం 8 జట్లు సూపర్-8 రౌండ్‌కు చేరుకుంటాయి. అక్కడ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల నుంచి నాలుగు జట్లు సెమీస్ ఆడతాయి. అందులో నెగ్గిన రెండు జట్లు టైటిల్ పోరులో తలపడతాయి.

భారత్ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు?

గ్రూపు దశలో భారత్‌‌కు సులభమైన డ్రా దక్కింది. గ్రూపు-ఏలో భారత్‌తోపాటు పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్‌ఏ, కెనడా జట్లు ఉన్నాయి. ఇందులో పాక్ మినహా మిగతా జట్లు భారత్ ముందు పసికూనలే. అద్భుతం జరిగితే తప్ప వాటిపై టీమ్ ఇండియాకు గెలుపు నల్లేరు మీద నడకే. గ్రూపు దశలో భారత్ ఆడే నాలుగు మ్యాచ్‌లకు అమెరికానే ఆతిథ్యమిస్తున్నది. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో పోరుతో టోర్నీలో భారత్ ప్రయాణం మొదలుకానుంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. జూన్ 9న న్యూయార్క్ వేదికగానే జరగనుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లోనే ఎదురుపడుతున్నాయి. ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో భారత్, పాక్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. మరో ఐదు నెలల్లో మరోసారి ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును చూడబోతున్నాం. జూన్ 12న యూఎస్‌ఏతో, జూన్ 15న కెనడాతో భారత్ ఆడనుంది.

గ్రూపులు.. జట్లు

గ్రూపు-ఏ : ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ

గ్రూపు-బి : ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూపు-సి : న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గునియా

గ్రూపు-డి : సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

Advertisement

Next Story