అన్షుమన్ గైక్వాడ్ కోసం నా పెన్షన్ డబ్బు ఇచ్చేస్తా!.. కపిల్ దేవ్ సంచలన నిర్ణయం

by Ramesh Goud |
అన్షుమన్ గైక్వాడ్ కోసం నా పెన్షన్ డబ్బు ఇచ్చేస్తా!.. కపిల్ దేవ్ సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కుటుంబసభ్యులు ఒప్పుకుంటే తన ఫెన్షన్ ఇచ్చేస్తానని, అతనికి బీసీసీఐ కూడా సహాయం చేయాలని టీమిండియా మాజీ క్రికెటర్ మొదటి ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ కోరారు. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న అన్షుమన్ గైక్వాడ్ ఆరోగ్యంపై స్పందించిన ఆయన బీసీసీఐకి లేఖ రాశారు. టీమిండియాకు రెండు సార్లు హెడ్ కోచ్ గా వ్యవహరించిన తన సహచరుడు అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్ భారిన పడి, ఏడాది కాలంగా ఇంగ్లాండులో చికిత్స తీసుకుంటున్నాడని, అతనికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

లేఖలో.. అన్షుతో కలిసి ఎన్నో మ్యాచ్ లు ఆడానని, ప్రస్తుతం అతడి పరిస్థితి చూసి తట్టుకోలేకపోతున్నానని తెలిపాడు. అన్షు మైదానంలో ధైర్యంగా నిలబడి, భయంకరమైన బంతులను ఎదుర్కొని ముఖం, చాతిపై ఎన్నో దెబ్బలు తిన్నాడని, ఇప్పుడు అతడికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు. అతడి వైద్య ఖర్చులకు అవసరమయ్యే డబ్బులు అందించేందుకు బీసీసీఐ ముందుకు రావాలని పేర్కొన్నాడు. అలాగే సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్ రవిశాస్త్రి, మదన్ లాల్, కీర్తి ఆజాద్, మొహిందర్, అమర్నాథ్, తాను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, మాతో పాటు బీసీసీఐ డబ్బులు అందించేందుకు సహాయం చేయాలని కోరారు.

ఇక ఈ తరం క్రికెటర్లకు రెమ్మూనరేషన్ బాగానే అందుతోందని, సపోర్టింగ్ స్టాఫ్ జీతాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ, అప్పట్లో పరిస్థితులు అలా ఉండేవి కాదని, బోర్డు దగ్గర తగినన్ని నిధులు లేకపోయేవి అని తెలిపారు. ఇప్పుడు బీసీసీఐ గొప్పగా ఎదిగిందని, మాజీ క్రికెటర్ల సంక్షేమం కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. అలాగే అన్షుమన్ గైక్వాడ్ కుటుంబసభ్యులు అంగీకరిస్తే.. తమ పెన్షన్ డబ్బు అందించేందుకు సిద్దంగా ఉన్నానని కపిల్ దేవ్ వెల్లడించారు. కాగా అన్షుమన్ గైక్వాడ్ 1974 లో క్రికెట్ లోకి అడుగుపెట్టి భారత జట్టు తరుపున 15 వన్డే మ్యాచ్‌లు 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అంతేగాక రెండు సార్లు టీమిండియాకు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.



Next Story