Asia Cup 2023: 'అస్సలు ఊహించలేదు.. ఆసియా కప్‌లో చోటుపై తెలుగు కుర్రాడు'

by Vinod kumar |
Asia Cup 2023: అస్సలు ఊహించలేదు.. ఆసియా కప్‌లో చోటుపై తెలుగు కుర్రాడు
X

డుబ్లిన్ : నేరుగా ఆసియా కప్‌‌కు ఎంపికవుతానని, ఆసియా కప్‌తోనే వన్డేల్లోకి అరంగేట్రం చేస్తానని అస్సలు ఊహించలేదని తెలుగు కుర్రాడు, టీమ్ ఇండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో తిలక్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌పై టీ20లోకి అరంగేట్రం చేసిన అతనికి ఆసియా కప్ ద్వారా వన్డే జట్టు నుంచి కూడా పిలుపు అందుకున్నాడు. ఆసియా కప్‌లో చోటు దక్కడంపై తిలక్ ఆనందం వ్యక్తం చేశాడు. తాజాగా తిలక్ వర్మ మాట్లాడిన వీడియోను బీసీసీఐ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియాలో తిలక్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

‘భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేయాలని కలలు కనేవాడిని. కానీ, ఆసియా కప్ ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తానని ఊహించలేదు. ఇది నాకు చాలా పెద్ద విషయం. ఒకే ఏడాదిలో టీ20లోకి అడుగుపెట్టడంతోపాటు ఆసియా కప్ నుంచి కూడా పిలుపు వచ్చింది. ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నా. వన్డేల్లో రాణిస్తానని నమ్మకంగా ఉన్నా.’ అని చెప్పాడు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ తనకెలా మద్దతుగా నిలిచాడో వివరించాడు.

‘ఐపీఎల్‌‌లో ఆడుతున్న మొదట్లో నేను కాస్త నెర్వస్‌గా ఉండేవాడిని. రోహిత్ భాయ్ నా దగ్గరికి వచ్చి ఆట గురించి మాట్లాడేవాడు. ‘ఆటను ఎంజాయ్ చేయాలి. ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఆడు. నాతో ఎప్పుడు మాట్లాడాలనుకున్న నా దగ్గరికి రావచ్చు. మెసేజ్ చేయొచ్చు. నీకు అండగా ఉంటాను’ అని రోహిత్ భాయ్ మద్దతుగా నిలిచేవాడు. అతనితో తరుచుగా మాట్లాడతా. రోహిత్ భాయ్ చెప్పినట్టే నేను ఆటను ఎంజాయ్ చేస్తున్నా.’ అని తిలక్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story