‘అతడికి భారతరత్న ఇవ్వండి’.. భారత్ వరల్డ్ కప్ గెలవడంతో కేంద్రానికి గవాస్కర్ కొత్త డిమాండ్

by Satheesh |
‘అతడికి భారతరత్న ఇవ్వండి’.. భారత్ వరల్డ్ కప్ గెలవడంతో కేంద్రానికి గవాస్కర్ కొత్త డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిచ్చిన టీ-20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తుచేసి పొట్టి ప్రపంచ కప్ ఫార్మాట్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించింది. కెప్టెన్ రోహిత్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో 17 ఏళ్ల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫి నెగ్గింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్, రాహుల్ జోడిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్ గెల్చిన అనంతరం టీ-20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పగా.. టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్ పదవి కాలం సైతం ఈ వరల్డ్ కప్ టోర్నీతోనే ముగియడం గమనార్హం. ఇదిలా ఉంటే, టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన రాహుల్ ద్రవిడ్ కోసం కేంద్ర ప్రభుత్వానికి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక డిమాండ్ చేశారు.

గవాస్కర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక ఆటగాడిగా, కోచ్, ఎన్సీఏ అకాడమీ చైర్మన్‌గా భారత క్రికెట్‌కు ద్రవిడ్ చేసిన సేవలకు భారతరత్న అవార్డ్ పొందేందుకు అర్హుడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు మరుపురాని విజయాలు అందించిన ద్రావిడ్.. కోచ్‌గానూ ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తోన్న వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించి 140 కోట్ల మంది ప్రజలను సంతోషపర్చారని కొనియాడారు. టీమిండియా వరల్డ్ కప్‌లో ప్లేయర్లతో పాటు ద్రావిడ్ పాత్ర కూడా కీలకమని చెప్పారు. కాగా, భారత దేశ చరిత్రలో క్రీడా రంగం నుండి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ మాత్రమే.

Advertisement

Next Story

Most Viewed