హెడ్ కోచ్ పదవి ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్.. నియామకం లాంఛనమే?

by Harish |
హెడ్ కోచ్ పదవి ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్.. నియామకం లాంఛనమే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం ఖరారైనట్టే. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూకు గంభీర్ ఒక్కడే హాజరవడంతో అతని నియామకం ఇక లాంఛనమే. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఇప్పటికే కొత్త ప్రధాన కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసింది. ఎంత మంది, ఎవరెవరు అప్లై చేసుకున్నారన్నది వెల్లడించలేదు.

అయితే, ఇంటర్వ్యూకు గంభీర్ ఒక్కడే హాజరైనట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూను రెండు దశల్లో నిర్వహించనున్నట్టు తెలిసింది. సోమవారం సీఏసీ వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఇంటర్వ్యూకు గంభీర్ హాజరయ్యాడు. సీఏసీ చైర్మన్ అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. బుధవారం రెండో రౌండ్ ఇంటర్వ్యూ ఉండనున్నట్టు తెలిసింది. అనంతరం సీఏసీ తన సిఫార్సులను బీసీసీఐకి తెలియజేయనుంది. ఆ తర్వాతి తుది ప్రకటన రానుంది.

మరోవైపు, గంభీర్ కూడా బీసీసీఐ ముందు పలు డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది. జట్టుపై పూర్తి కమాండ్, వేర్వేరుగా వైట్ బాల్, రెడ్ బాల్ జట్ల ఏర్పాటు, సొంత కోచింగ్ స్టాఫ్‌ అడిగినట్టు సమాచారం. వాటికి బీసీసీఐ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. గంభీర్ నియామకంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story