92 ఏళ్లలో తొలిసారి.. చారిత్రాత్మక మైలురాయిని సాధించిన టీమిండియా

by Harish |
92 ఏళ్లలో తొలిసారి.. చారిత్రాత్మక మైలురాయిని సాధించిన టీమిండియా
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు విజయంతో టీమ్ ఇండియా అరుదైన రికార్డు సృష్టించింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓటముల కంటే ఎక్కువ విజయాలను నమోదు చేసింది. 1932 నుంచి భారత్ టెస్టు క్రికెట్ ఆడుతోంది. ఈ 92 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఓడిన మ్యాచ్‌ల కంటే గెలిచిన మ్యాచ్‌లు ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్ గెలుపోటముల సంఖ్య(178) సమానంగా ఉండేది. తొలి టెస్టులో నెగ్గడంతో రోహిత్ సేన 179వ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఓటముల సంఖ్యను అధిగమించింది.

భారత జట్టు ఇప్పటివరకు 580 టెస్టులు ఆడింది. అందులో 179 విజయాలు, 178 ఓటములు ఉన్నాయి. 222 మ్యాచ్‌లను డ్రా చేసుకోగా.. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఓటముల కంటే ఎక్కువ విజయాలను నమోదు చేసిన జాబితాలో భారత్ కూడా చేరింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏడు జట్లు మాత్రమే ఈ ఫీట్ సాధించగా.. ప్రస్తుతం ఐదు జట్లు మాత్రమే ఈ రికార్డును కలిగి ఉన్నాయి.

భారత్‌తోపాటు ఆస్ట్రేలియా(414 విజయాలు, 232 ఓటములు), ఇంగ్లాండ్(397 విజయాలు, 325 ఓటములు), సౌతాఫ్రికా(179 విజయాలు, 161 ఓటములు), పాకిస్తాన్(148 విజయాలు, 144 ఓటములు) ఆ జాబితాలో ఉన్నాయి. అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ ఈ ఘనత సాధించి నిలబెట్టుకోలేకపోయాయి. మరోవైపు, న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఇప్పటివరకు ఓటముల సంఖ్యను అధిగమించలేదు.

Next Story