దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌కు స్టార్ క్రికెటర్లు దూరం.. తెలుగు కుర్రాడు రషీద్‌కు చోటు

by Harish |
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌కు స్టార్ క్రికెటర్లు దూరం.. తెలుగు కుర్రాడు రషీద్‌కు చోటు
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లు ఈ నెల 12 నుంచి 15 వరకు జరగనున్నాయి. తొలి రౌండ్‌లో భాగమైన భారత స్టార్ క్రికెటర్లు రెండో రౌండ్‌కు దూరంగా ఉండనున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన రిషబ్ పంత్, యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్‌లను బీసీసీఐ దులీప్ ట్రోఫీ జట్ల నుంచి తొలగించింది. ఈ నెల 19 నుంచి బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. మంగళవారం బీసీసీఐ రెండో రౌండ్‌కు జట్లను ప్రకటించింది. టీమిండియా క్రికెటర్లు దూరమవడంతో భారత ‘ఏ’, ‘బి’, ‘డి’ జట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి.

భారత ‘ఏ’ జట్టు కెప్టెన్‌గా గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ పగ్గాలు చేపట్టనున్నాడు. అలాగే, తెలుగు కుర్రాడు ఎస్‌కె రషీద్ భారత ‘ఏ’ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రథమ్ సింగ్(రైల్వేస్), విదర్భ ప్లేయర్ అక్షయ్ వాడ్కర్‌‌, షామ్ ములానీ, ఆకిబ్ ఖాన్‌లను ‘ఏ’ జట్టులోకి తీసుకున్నారు. యువ బ్యాటర్ రింకు సింగ్ రెండో రౌండ్‌ ఆడనున్నాడు. తొలి రౌండ్‌కు, బంగ్లాతో టెస్టులకు అతన్ని విస్మరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రింకును భారత ‘బి’ జట్టులోకి తీసుకున్నారు. రింకుతోపాటు సూయశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి(మధ్యప్రదేశ్) ఎంపికయ్యారు.

బంగ్లాతో తొలి టెస్టుకు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్‌ రెండో రౌండ్‌‌కు కూడా అందుబాటులో ఉండనున్నాడు. దీంతో తొలి టెస్టులో తుది జట్టులో సర్ఫరాజ్‌కు చోటు దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. అలాగే, ‘డి’ జట్టులో హర్యానాకు చెందిన నిశాంత్ సింధుకు చోటు దక్కింది. యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే గాయం కారణంగా రెండో రౌండ్‌కు దూరమవ్వగా.. భారత ‘ఏ’ ఆటగాడు విద్వాత్ కావెరప్ప అతని స్థానాన్ని భర్తీ చేశాడు. భారత ‘సి’ జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత ‘ఏ’ జట్టుపై ‘బి’ జట్టు.. ‘డి’ టీమ్‌పై ‘సి’ జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ‘డి’ జట్టుతో ‘ఏ’ జట్టు, ‘సి’ జట్టుతో ‘బి’ టీమ్ తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed