జకో ఖాతాలో మరో ఘనత.. ఫెదరర్ రికార్డు బ్రేక్

by Harish |
జకో ఖాతాలో మరో ఘనత.. ఫెదరర్ రికార్డు బ్రేక్
X

దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత నోవాక్ జకోవిచ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఏటీపీ సోమవారం ప్రకటించిన మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ సెర్బియా స్టార్ వరల్డ్ నం.1గా 419 వారంలోకి అడుగుపెట్టాడు. దీంతో 36 ఏళ్ల జకోవిచ్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నం.1గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టెన్నిస్ దిగ్గజం, రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) పేరిట ఉండగా తాజాగా జకో అధిగమించాడు. సింగిల్స్‌లో అత్యధిక వారాలపాటు అగ్రస్థానంలో నిలిచిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది. గతేడాది ఫిబ్రవరిలో జర్మనీ దిగ్గజ క్రీడాకారిణి స్టెఫాన్ గ్రాఫ్(377 వారాలు) రికార్డును జకో బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. 2011లో 24 ఏళ్ల వయసులో మొదటిసారి వరల్డ్ నం.1గా నిలిచిన జకోవిచ్.. అప్పటి నుంచి దాదాపు 13 ఏళ్లలో అతను ఎక్కువగా టాప్ ర్యాంక్‌నే కలిగి ఉన్నాడు.

బోపన్న మళ్లీ డబుల్స్‌లో వరల్డ్ నం.1గా

భారత దిగ్గజ డబుల్స్ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. శనివారం మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న మియామి ఓపెన్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో 44 ఏళ్ల బోపన్న ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌ను పొందగా.. ఎబ్డెన్ రెండో స్థానంలో నిలిచాడు. జనవరిలో తొలిసారిగా బోపన్న అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా, డబుల్స్‌లో వరల్డ్ నం.1గా నిలిచిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed