మెరిసిన శ్రీజ..తొలి ఇంటర్నేషనల్ టైటిల్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి

by Harish |
మెరిసిన శ్రీజ..తొలి ఇంటర్నేషనల్ టైటిల్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి
X

దిశ, స్పోర్ట్స్ : హైదరాబాదీ అమ్మాయి, భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. అమెరికాలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ కార్పస్ క్రిస్టీ టోర్నీలో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. శ్రీజ కెరీర్‌లో ఇదే తొలి ఇంటర్నేషనల్ టైటిల్. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో శ్రీజ 3-0(11-6, 18-16, 11-5) తేడాతో అమెరికా క్రీడాకారిణి లిల్లీ జాంగ్‌ను చిత్తు చేసింది. వరల్డ్ నం.94 ర్యాంకర్ అయిన శ్రీజ తన కంటే ఎంతో మెరుగైన వరల్డ్ నం.46 ప్లేయర్ లిల్లీ జాంగ్‌‌ను ఓడించడం విశేషం. క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌ల్లోనూ ఆమె తన కంటే మెరుగైన ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. మ్యాచ్ అనంతరం శ్రీజ మాట్లాడుతూ..‘తొలి అంతర్జాతీయ టైటిల్ గెలవడం సంతోషంగా ఉంది. ఎంతో కష్టపడి ఇక్కడికి చేరుకున్నా. ఈ విజయం భారత మహిళల జట్టు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో సహాయపడుతుంది. సింగిల్స్‌లో క్వాలిఫై అవ్వడానికి నాకు కూడా సహాయపడుతుంది. ఈ టైటిల్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పారిస్ ఒలింపిక్స్‌తోపాటు భవిష్యత్తులో జరగబోయే టోర్నీలకు సన్నద్ధమయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం నాకు సహాయం చేయాలి.’ అని శ్రీజ తెలిపింది. కాగా, కామన్వెల్త్ గేమ్స్-2022లో శ్రీజ.. స్టార్ ఆటగాడు శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed