స్టార్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు.. జాబితాలో ఉన్న క్రికెటర్లు వీరే

by Harish |
స్టార్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు.. జాబితాలో ఉన్న క్రికెటర్లు వీరే
X

దిశ, స్పోర్ట్స్ : యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) 2025కు సంబంధించి ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్(ఆర్‌టీపీ)’లో కొత్త అథ్లెట్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితాలో టాప్ క్రికెటర్లు, సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లను చేర్చింది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్, స్టార్ ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా వంటి ప్రముఖ క్రికెటర్లు ఉన్నారు. ప్రస్తుత ఆర్‌టీపీలో ఇతర క్రీడలకు చెందిన అథ్లెట్లతోపాటు 14 మంది(పురుషుల, మహిళలు) క్రికెటర్లు ఉన్నారు. సూర్య, బుమ్రా, గిల్, పంత్, పాండ్యాతోపాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్, తిలక్ వర్మలను కొత్త లిస్ట్‌లో చేర్చారు. మహిళా క్రికెటర్లలో షెఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, పేసర్ రేణుక సింగ్ ఉన్నారు.

నాడాకు చెందిన డోప్ కంట్రోల్ ఆఫీసర్స్(డీసీవో) జాబితాలోని క్రికెటర్ల నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించనున్నారు. ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో జరుగుతున్న సమయంలోనే డీసీవోలు శాంపిల్స్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వివిధ మ్యాచ్ వేదికలను వారు సందర్శించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు నాడా ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. డోపింగ్ నిరోధక కార్యక్రమంలో తమ పరిధిని విస్తరించే విధంగా నాడా ఈ చర్యలు చేపట్టింది. ఆర్‌టీపీలో ఉన్న అథ్లెట్లు ‘ఆచూకీ’ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. 12 నెలల్లో మూడుసార్లు ‘ఆచూకీ’ వివరాలు తెలియజేయడంలో విఫలమైతే యాంటీ డోపింగ్ నియమాలను ఉల్లంఘించినట్టు అవుతుంది. తాజాగా క్రికెటర్ల చేరికతో నాడా ఆర్‌టీపీ జాబితాలో 227 క్రీడాకారులు ఉన్నారు. 2019 నుంచి బీసీసీఐ నాడా పరిధిలోకి వచ్చింది. 2020లో తొలిసారిగా పుజారా, జడేజా, కేఎల్ రాహుల్, స్మృతి మంధాన, దీప్తి శర్మలను ఆర్‌టీపీలో చేర్చింది.


Next Story

Most Viewed