ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న భారత బాక్సర్లు నిశాంత్, సచిన్

by Harish |   ( Updated:2024-05-28 16:49:22.0  )
ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న భారత బాక్సర్లు నిశాంత్, సచిన్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి అవకాశమైన వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్లు నిశాంత్ దేవ్, సచిన్ సివాచ్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్‌లో ఈ ఇద్దరు బాక్సర్లు విజయాలు నమోదు చేశారు. పురుషుల 71 కేజీల కేటగిరీలో నిశాంత్.. మంగోలియా బాక్సర్ ఒట్గోన్‌బాటర్‌ను చిత్తు చేశాడు. నిశాంత్ జబ్, క్రాస్ పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకపడ్డాడు. దీంతో తొలి రౌండ్‌లో మరో 58 సెకన్లు మిగిలి ఉండగానే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిశాంత్‌ను విజేతగా ప్రకటించాడు. అలాగే, 57 కేజీల కేటగిరీలో సచిన్ 5-0 తేడాతో డెన్మార్క్‌కు చెందిన ఫ్రెడరిక్ జెన్సన్‌ను మట్టికరిపించాడు. సచిన్ పంచ్‌లకు డెన్మార్క్ ప్లేయర్ వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సచిన్ ఏకపక్షంగా బౌట్‌ను గెలుచుకున్నాడు.

మరో భారత బాక్సర్ అభినాష్ జమ్వాల్ 63.5 కేజీల కేటగిరీలో తన పోరాటాన్ని ముగించాడు. రెండో రౌండ్‌లో అభినాష్ 0-5 తేడాతో జోస్ మాన్యుయెల్ వయఫరా ఫోరి(కొలంబియా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి రౌండ్‌ కోల్పోయిన తర్వాత బలంగా పుంజుకున్న అభినాష్ మూడో, ఫైనల్ రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో ఇద్దరు బాక్సర్లు ఐదుగురు జడ్జిల నుంచి సమంగా స్కోర్లు పొందారు. రూల్స్ ప్రకారం.. జడ్జిలు పర్ఫామెన్స్‌ను బేరీజు వేసుకుని విజేతను నిర్ణయించారు. ఐదుగురు జడ్జిలు ఫోరికి అనుకూలంగా ఓటు వేయడంతో అభినాష్‌కు నిరాశ తప్పలేదు. నేడు ప్రీక్వార్టర్స్‌లో పురుషుల విభాగంలో నరేందర్(92+కేజీలు), నిశాంత్, మహిళల విభాగంలో అరుంధతి చౌదరి(66కేజీలు), అంకుషిత(60 కేజీలు) పోటీపడనున్నారు.

Advertisement

Next Story

Most Viewed